Manipur Video: ఆ వీడియో చూసి గుండె బద్దలైంది.. ఇదో అనాగరిక చర్య: మమతా బెనర్జీ

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నన్నంగా ఊరేగిస్తూ తీసుకెళ్లడంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదో అనాగరిక చర్య అని ఆమె అన్నారు. 

Published : 20 Jul 2023 18:18 IST

కోల్‌కతా: మణిపుర్‌లో (Manipur) చోటు చేసుకున్న అమానవీయ ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benerjee) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదో అనాగరిక చర్య అని ఆమె అన్నారు. నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ తరహా ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అమె అన్నారు. దేశం మొత్తం ఒకే మాటపై నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు. బాధితులకు సరైన న్యాయం జరిగేలా చూడాలన్నారు. 

‘‘మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై అసాంఘిక శక్తులు ప్రవర్తించిన వీడియో చూస్తే గుండె బద్దలైంది. కోపాన్ని అణుచుకోలేక పోయాను.ఆ అణగారిన వర్గాల మహిళలపై జరిగిన దాడుల గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. ఇదో అనాగరిక చర్య. మానవత్వంపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది.’’ అని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో పోస్టు చేశారు.

మహిళలపై అమానుషం.. మణిపుర్‌లో భారీ నిరసన ర్యాలీ

మరోవైపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ తీసుకెళ్లిన ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు సహా ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, మణిపుర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నేరస్తుల్ని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ అమానవీయ ఘటనపై ఇప్పటికే లోతైన దర్యాప్తు చేపడుతున్నట్లు మణిపుర్‌ ప్రభుత్వం ప్రకటించింది.  అంతేకాకుండా ఘటనపై తగిన రీతిలో స్పందించాలని లేదంటే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు హెచ్చరించింది.

ఈ దారుణాన్ని నిరసిస్తూ మణిపుర్‌ ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. మణిపుర్‌లోని చురచంద్‌పుర్‌ జిల్లాలో వేలాది మంది ప్రజలు నల్లదుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. బాధిత మహిళలకు న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్థానికులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని