Bhupesh Baghel: కాంగ్రెస్‌ సమావేశంలో క్యాండీక్రష్‌ ఆడిన సీఎం.. ఫొటో షేర్‌ చేసి భాజపా విమర్శలు..

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ (Bhupesh Baghel) క్యాండీక్రష్‌ ఆడుతున్న ఫొటో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై భాజపా వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.

Published : 11 Oct 2023 14:09 IST

రాయ్‌పుర్‌: అసెంబ్లీ ఎన్నికల (Assembly elections 2023)కు సిద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో రాజకీయం మరింత వేడెక్కింది. కీలక సమావేశంలో ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ (CM Bhupesh Baghel) తన ఫోన్‌లో క్యాండీక్రష్‌ ఆడుతున్న ఫొటోను షేర్‌ చేసిన భాజపా (BJP) వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. దీనికి బఘేల్‌ కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..

రాయ్‌పుర్‌లోని కాంగ్రెస్‌ (Congress) పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి బఘేల్‌ తన ఫోన్‌లో గేమ్‌ ఆడుతూ కన్పించిన ఓ ఫొటోను భాజపా (BJP) తమ ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేసింది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అలాంటి సమావేశంలో బఘేల్‌ గేమ్‌ ఆడుతూ కన్పించడంతో భాజపా వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.

‘‘ఎంత ప్రయత్నించినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) పార్టీ గెలవదని సీఎం భూపేశ్ బఘేల్‌కు తెలుసు. అందుకే ఆయన రిలాక్స్‌ అవుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కోసం జరిగిన ఈ సమావేశంపై దృష్టి పెట్టే బదులు.. క్యాండీక్రష్‌ ఆడుకోవడమే మేలని ఆయన భావించి ఉంటారు’’ అని భాజపా ఎద్దేవా చేసింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

న్యూస్‌క్లిక్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఫౌండర్‌ ఇల్లు, ఆఫీసులో సీబీఐ సోదాలు

అయితే, భాజపా విమర్శలకు సీఎం బఘేల్‌ (Bhupesh Baghel) స్పందించారు. ‘‘అంతకు ముందు నేను బైక్‌ నడిపినప్పుడు, ఛత్తీస్‌గఢ్‌ సంప్రదాయ ఆటలను ఆడితే భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు సమావేశానికి ముందు నేను క్యాండీక్రష్‌ ఆడిన ఫొటోను షేర్ చేస్తూ విమర్శలు చేసింది. నిజం చెప్పాలంటే నా ఉనికే వారికి నచ్చట్లేదు. కానీ, (అధికారంలో) ఎవరు ఉండాలో? ఎవరు ఉండకూడదో నిర్ణయించేది రాష్ట్ర ప్రజలే. నేను సంప్రదాయ ఆటలు ఆడుతా. క్యాండీక్రష్‌ కూడా నా ఫేవరెట్‌ గేమ్‌. ఇప్పటివరకు అన్ని లెవల్స్‌ దాటేశాను. ఇక ముందు కూడా ఇదే కొనసాగిస్తా. ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఛత్తీస్‌గఢ్‌ మొత్తానికీ తెలుసు’’ అని సీఎం భాజపాను దుయ్యబట్టారు.

90 శాసనసభ నియోజకవర్గాలున్న ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 7, 17వ తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని