NewsClick: న్యూస్‌క్లిక్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఫౌండర్‌ ఇల్లు, ఆఫీసులో సీబీఐ సోదాలు

ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ (NewsClick)పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థ ఇల్లు, ఆఫీసులో బుధవారం సోదాలు చేపట్టింది. ఇప్పటికే ప్రబీర్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Published : 11 Oct 2023 11:22 IST

దిల్లీ: చైనా (China) నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్‌ వార్తా పోర్టల్‌ ‘న్యూస్‌క్లిక్‌ (NewsClick)’పై దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తోంది. ఈ సంస్థపై తాజాగా  సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించిన సీబీఐ.. న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థ (Prabir Purkayastha) ఇల్లు, ఆఫీసులో బుధవారం సోదాలు చేపట్టింది. ఈ ఉదయం ప్రబీర్‌ నివాసానికి, కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు ఏకకాలంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు.

ఇటీవల ప్రబీర్‌ను దిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందాయన్న ఆరోపణలపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు.. ఇటీవల ప్రబీర్‌ నివాసం సహా ఆ సంస్థ కార్యాలయం, అందులో పనిచేసే సీనియర్‌ జర్నలిస్టుల ఇళ్లల్లో విస్తృత సోదాలు చేపట్టారు. అనంతరం ప్రబీర్‌ను, సంస్థ హెచ్‌ఆర్‌ హెడ్‌ అమిత్‌ చక్రవర్తిని అరెస్టు చేశారు. వీరికి కోర్టు పోలీసు కస్టడీ విధించింది.

భారత్-కెనడా దౌత్య వివాదం.. విదేశాంగ మంత్రుల రహస్య భేటీ..!

భారత్‌ వ్యతిరేక ప్రచారం కోసం, దేశ సార్వభౌమత్వాన్ని భంగపరిచేందుకు న్యూస్‌క్లిక్‌కు (NewsClick) చైనా నుంచి భారీ మొత్తాల్లో నిధులు వచ్చాయంటూ దిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కొంత మంది వ్యక్తులతో కలిసి 2019 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు వీరు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను న్యూస్‌క్లిక్‌ తోసిపుచ్చింది. హింస, వేర్పాటువాదం, మరే విధమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తామెన్నడూ పాల్పడలేదని, తమ వార్తా కథనాల్ని చూసినా ఈ విషయం తెలుస్తుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని