Chief Justice of India: ఉక్రెయిన్‌పై దాడి ఆపమని పుతిన్‌ను ఆదేశించగలమా..?

‘ఉక్రెయిన్‌పై చేస్తోన్న దాడిని నిలిపివేయమని నేను రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆదేశాలు ఇవ్వగలనా..?’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Updated : 03 Mar 2022 13:52 IST

విద్యార్థుల గురించి మేం ఆందోళన చెందుతున్నాం: సీజేఐ

దిల్లీ: ‘ఉక్రెయిన్‌పై దాడిని నిలిపివేయమని నేను రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆదేశాలు ఇవ్వగలనా..?’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల రక్షణకు సంబంధించి సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణలో భాగంగా ఆయన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో గురించి ప్రస్తావించారు.

‘సోషల్ మీడియాలో నేను ఒక వీడియో చూశాను. ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తున్నారని అందులో ప్రశ్నిస్తున్నారు. ఈ సైనిక చర్యను ఆపండని నేను రష్యా అధ్యక్షుడికి ఆదేశాలు ఇవ్వగలనా..? ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల గురించి మేం ఆందోళన చెందుతున్నాం. కేంద్రం తన పని తాను చేస్తోంది’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అనంతరం రొమేనియాకు సమీపంలో ఉక్రెయిన్‌ సరిహద్దులో చిక్కుకుపోయిన విద్యార్థులకు సాయం చేయడానికి కృషి చేయాలని అటార్నీ జనరల్‌కు న్యాయస్థానం సూచించింది. 

ఇదిలా ఉండగా.. రష్యా సేనల భీకర దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌ను ఇప్పటివరకు దాదాపు 17వేల మంది భారత పౌరులు ఆ దేశాన్ని వీడినట్లు నిన్న విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు 3 వేల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని తెలిపారు. భారత వైమానిక దళం కూడా ఆపరేషన్‌ గంగాలో చేరినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడే.. కేంద్రం పౌరుల తరలింపు ప్రణాళికను ప్రకటించింది. కానీ, ఈ లోపే గత గురువారం రష్యా అనూహ్యంగా సైనిక చర్యను ప్రకటించింది. ఆ వెంటనే ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేసింది. దాంతో భారతీయుల తరలింపు క్లిష్టంగా మారింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని