Ladakh: సరిహద్దులో చైనా ‘యుద్ధ’ విన్యాసాలు

సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్‌, చైనా మధ్య నెలకొన్ని ప్రతిష్టంభన ఇంకా సమసిపోనేలేదు.. కానీ డ్రాగన్‌ మాత్రం తన వక్రబుద్ధి చూపిస్తూనే ఉంది. తూర్పు లద్దాఖ్‌కు అభిముఖంగా

Published : 08 Jun 2021 17:08 IST

దిల్లీ: సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్‌, చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా సమసిపోనేలేదు.. కానీ డ్రాగన్‌ మాత్రం తన వక్రబుద్ధి చూపిస్తూనే ఉంది. తూర్పు లద్దాఖ్‌కు అభిముఖంగా ఉన్న తన వైమానిక స్థావరాల వద్ద అధునాత యుద్ధ విమానాలతో భారీ విన్యాసాలు చేపట్టింది. దాదాపు 22 యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. 

తూర్పు లద్ధాఖ్‌లోని వాస్తవాధీన రేఖకు అటువైపుగా కొద్ది రోజుల క్రితం చైనా ఈ భారీ ప్రదర్శన చేపట్టిందని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. జె-11, జె-16 సహా పలు అధునాతన యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయని తెలిపాయి. భారత దళాలు వీటిని నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొన్నాయి. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న హోటన్‌, గార్‌ గున్సా, కాష్గర్‌ వైమానిక స్థావరాల నుంచి డ్రాగన్‌ ఈ విన్యాసాలు చేపట్టింది. వీటిని చైనా ఇటీవల అప్‌గ్రేడ్‌ చేసింది. అన్ని రకాల యుద్ధ విమానాలు ఇక్కడ ల్యాండ్‌ అయ్యేలా తీర్చిదిద్దింది. అయితే ఈ డ్రిల్స్‌ సమయంలో చైనా యుద్ధవిమానాలు తమ గగనతలంలోనే ఉన్నాయని రక్షణశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

గతేడాది గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత రెండు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి లద్దాఖ్‌లో భారత్‌ కూడా వాయుసేన గస్తీని పెంచింది. మిగ్‌ సహా పలు ఫైటర్‌ జెట్లు నిరంతరం ఈ ప్రాంతంలో పహారా కాస్తున్నాయి. అధునాతన రఫేల్‌ యుద్ధ విమానాలు కూడా ఈ విధుల్లో ఉంటున్నాయి. 

పలు దఫాల చర్చల అనంతరం ఇటీవల రెండు దేశాలు సరిహద్దుల నుంచి తమ బలగాలను వెనక్కిపంపాయి. అయితే పాంగాంగ్‌ సరస్సు వద్ద చైనా బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ ఇంకా ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే చైనా వాయుసేన కార్యకలాపాలను భారత్‌ నిశితంగా గమనిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని