Punjab Polls: పంజాబ్‌ ఎన్నికల ముందు.. డేరా బాబాకు బెయిల్‌..!

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ జీవిత ఖైదు అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు న్యాయస్థానం 21 రోజుల పాటు బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 07 Feb 2022 14:43 IST

21 రోజులపాటు బయట ఉండనున్న డేరా సచ్చా సౌదా అధినేత

ఛండీగఢ్‌: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ జీవిత ఖైదు అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు 21 రోజుల పాటు బెయిల్‌ లభించింది. శిక్ష ఖరారైన ఖైదీలకు ఇచ్చే ప్రత్యేక సెలవు (Furlough)కింద ఆయన ఈ అవకాశం లభించింది. 2017లో నుంచి రోహ్‌తక్‌లోని సునారియా జైలులో ఉన్న ఆయన.. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారి జైలు నుంచి బయటకు రానున్నారు. అయితే, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు డేరా బాబా బయటకు రావడం గమనార్హం. అయితే, డేరా బాబా బెయిల్‌కు ఎన్నికలకు సంబంధం లేదని.. నిబంధనల ప్రకారమే ఆయనకు ఫర్లాఫ్‌ లభించిందని హరియాణా జైళ్లశాఖ మంత్రి రంజిత్‌ సింగ్‌ చౌతాలా స్పష్టం చేశారు.

పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో గుర్మీత్‌ సింగ్‌తోపాటు ఆయన అనుచరులకు మంచి పట్టుంది. పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికల్లోనూ వారు కీలకంగా ఉంటున్నట్లు మునుపటి ఫలితాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా చాలా అసెంబ్లీ స్థానాల్లో ఆయన ప్రభావం కనిపిస్తుంది. అయితే, రామ్‌ రహీమ్‌ జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆయన అనుచరులు మాత్రం స్థానిక నేతల ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల్లో మద్దతు తెలుపుతున్నారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌, భాజపాతోపాటు అకాలీదళ్‌ వంటి పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక నేతల మన్ననలను చూరగొనేందుకు ఆయా పార్టీలు వారితో సన్నిహితంగా మెలుగుతాయని సమాచారం. ఇలాంటి తరుణంలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజుల ముందే గుర్మీత్‌ సింగ్‌ జైలు నుంచి బయటకు రానుండడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇదిలాఉంటే, సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తోన్న గుర్మీత్‌ సింగ్‌.. పలువురు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరస్కరించిన వారిని హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసు నిరూపితం కావడంతో 2017 నుంచి ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం రోహ్‌తక్‌లోని సునారియా జైలులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ శిక్ష అనుభవిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని