‘భారత ప్రజలారా క్షమించండి’: దౌత్యవివాదంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు

భారత్‌తో వివాదం తమపై ఎంతో ప్రభావం చూపిందని, మరీ ముఖ్యంగా పర్యాటక రంగాన్ని దెబ్బతీసిందని మాల్దీవుల(Maldives) మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ నషీద్ అన్నారు. 

Updated : 09 Mar 2024 10:48 IST

దిల్లీ: భారత్‌తో దౌత్యవివాదం వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాలపై మాల్దీవుల(Maldives) మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ నషీద్( Mohamed Nasheed ) ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశ ప్రజల తరఫున భారత్‌కు క్షమాపణలు తెలియజేశారు. మనదేశంలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు.

‘‘ఈ దౌత్యవివాదం, బాయ్‌కాట్ పిలుపు వల్ల మాల్దీవులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిణామాలతో ఆందోళన చెందాను. దీనిపై మాల్దీవుల ప్రజల తరఫున క్షమాపణలు చెప్తున్నాను. ఈ సెలవులకు భారతీయులు మా దేశం రావాలని కోరుకుంటున్నాం. ఎప్పటిలాగే మా ఆతిథ్యం ఉంటుంది. దానిలో ఎలాంటి మార్పు ఉండదు’’ అని నషీద్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.

భారత హెలికాప్టర్‌, సిబ్బందిపై పూర్తి నియంత్రణ మాదే: మాల్దీవులు

‘‘భారత దళాలు మా దేశం విడిచివెళ్లాలని అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు కోరినప్పుడు.. భారత్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. తన బలాన్ని ప్రదర్శించాలని అనుకోలేదు. ‘సరే, చర్చిద్దాం’ అంటూ సంయమనం పాటించింది’’ అని కొనియాడారు. అలాగే ఇటీవల మాల్దీవులు-చైనా మధ్య జరిగిన సైనిక సహకార ఒప్పందం గురించి మాట్లాడారు. ‘‘రబ్బర్‌ బుల్లెట్లు, టియర్ గ్యాస్‌ వంటి కొన్ని పరికరాలను ముయిజ్జు కొనుగోలు చేయాలనుకుంటున్నారని భావిస్తున్నాను. అవి అవసరమని ప్రభుత్వం భావించడం దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ(Modi) కొద్దినెలల క్రితం లక్షద్వీప్‌లో పర్యటించడంపై మాల్దీవుల(Maldives) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాయ్‌కాట్ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత వివాదం నడుస్తున్నా.. చైనా అనుకూలనేతగా పేరున్న కొత్త అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు డ్రాగన్‌ దగ్గరవుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ రెండు దేశాల మధ్య సైనిక సహకారంపై ఒప్పందం జరిగింది. మాల్దీవులకు ఉచితంగా సైనిక పరికరాలను అందించేందుకు చైనా ముందుకొచ్చింది. ఇక,మే 10 తర్వాత భారత్‌కు చెందిన ఒక్క మిలిటరీ సిబ్బంది (Indian troops) కూడా తమ భూభాగంలో ఉండకూదని అన్నారు. కనీసం సివిల్‌ డ్రెస్సుల్లో కూడా ఇక్కడ సంచరించొద్దంటూ నోరుపారేసుకున్నారు. ఆయన తీరును విపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. భారత ప్రజలతో  తమ బంధం రాజకీయాలకు అతీతమని అక్కడి పర్యటక సంఘాలు స్పందించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని