అంధుడైన గురువును హేళన చేస్తూ రీల్‌.. విద్యార్థుల సస్పెన్షన్‌

సామాజిక మాధ్యమాల పిచ్చిలో యువత తరచూ పెడదోవ పడుతున్నారనేందుకు కేరళలో జరిగిన ఈ ఉదంతమే నిదర్శనం. అంధుడైన గురువును కొందరు విద్యార్థులు తరగతి గదిలో ఆట పట్టిస్తూ హేళన చేశారు.

Published : 16 Aug 2023 04:59 IST

సామాజిక మాధ్యమాల పిచ్చిలో యువత తరచూ పెడదోవ పడుతున్నారనేందుకు కేరళలో జరిగిన ఈ ఉదంతమే నిదర్శనం. అంధుడైన గురువును కొందరు విద్యార్థులు తరగతి గదిలో ఆట పట్టిస్తూ హేళన చేశారు. తమ పిచ్చిచేష్టలను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్టు చేశారు. ఎర్నాకుళం మహారాజా ప్రభుత్వ కళాశాలలో రాజనీతిశాస్త్రం బోధించే అధ్యాపకుడికి చూపు లేదు. అయినా అదే కళాశాలలో చదువుకొని గురువు స్థాయికి ఆయన ఎదిగారు. ఇటీవల ఓ తరగతి గదిలో పాఠం చెబుతుండగా.. కొందరు విద్యార్థులు ఆయన చుట్టూ చేరి అల్లరి చేశారు. దృష్టిలోపాన్ని ప్రస్తావిస్తూ అవమానకరంగా మాట్లాడారు. ఈ వీడియో వైరల్‌గా కావడంతో గురువు పట్ల విద్యార్థుల తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. విషయం కళాశాల యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో ఆ ఘటనకు బాధ్యుడైన ఓ విద్యార్థి నేతతోపాటు ఆరుగురిని సస్పెండ్‌ చేశారు. బాధిత అధ్యాపకుడు దీనిపై మాట్లాడుతూ..‘‘నేను ఒక గంటసేపు బోధనకు రెండు గంటలు సిద్ధమై తరగతి గదికి వచ్చా. ఆ వీడియో చూసి నా స్నేహితులు, బంధువులు బాధపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కళాశాల పరిధిలోనే ఈ సమస్యను పరిష్కరించుకుంటాం’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని