ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం

మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు.

Updated : 28 Apr 2024 06:38 IST

సుప్రీంకోర్టులో దర్యాప్తు సంస్థ ఆరోపణలకు కేజ్రీవాల్‌ సమాధానం

దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా ఎన్నికలు జరగాలన్న ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై జరిగిన దాడిగా ఈడీ చర్యను ఆయన అభివర్ణించారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సమయంలో, ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థ వ్యవహరించిన తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని దుయబట్టారు. ఈడీ ద్వారా మనీలాండరింగ్‌ చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందనడానికి ఇదో ప్రబల నిదర్శనమని పేర్కొన్నారు. తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినా దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకాకపోవడంతోనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాల్సి వచ్చిందంటూ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈడీ పేర్కొనడంపై కేజ్రీవాల్‌ తిరుగు సమాధానమిచ్చారు.

తనకు వచ్చిన సమన్లకు తగిన విధంగానే స్పందించానని, దర్యాప్తునకు సహకరించడంలేదని ఈడీ కూడా ఎన్నడూ చెప్పలేదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఈ కేసుకు కావల్సిన సమాచారాన్ని, పత్రాలను రాత పూర్వకంగా, వర్చువల్‌ విధానంలో కోరి ఉండవచ్చని పేర్కొన్నారు. లేదంటే అధికారిని పంపించి అయినా కావాల్సిన వివరాలను రాబట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఇవేవీ చేయని ఈడీ....తనను కస్టడీలో ఉంచి విచారిస్తేనే విషయాలను రాబట్టగలమన్నట్లు వ్యవహరించిందని ఆక్షేపించారు. రాజకీయ కార్యకలాపాలు చురుగ్గా జరిగే ఎన్నికల సమయంలో తనను అరెస్టు చేయాల్సిన అవసరమేలేదని, తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన సమాధానంలో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. గత వారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మద్యం పాలసీ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి కేజ్రీవాలేనని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్‌ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తిహాడ్‌ జైలులో ఉన్నారు.

జైల్లో కేజ్రీవాల్‌ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఎయిమ్స్‌ వైద్యుల కమిటీ నివేదిక

తిహాడ్‌ జైల్లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్‌ వైద్యుల కమిటీ వెల్లడించినట్లు తెలుస్తోంది. వైద్యుల బృందం శనివారం కేజ్రీవాల్‌ను పరీక్షించింది. మధుమేహంతో బాధపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుడిని రోజూ వీడియో ద్వారా సంప్రదించే అవకాశం కల్పించాలని ఇటీవల దిల్లీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని ఈడీ వ్యతిరేకించింది. అయితే, ఆయనకు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ అవసరమా? ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా దిల్లీ ఎయిమ్స్‌ను కోర్టు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఎయిమ్స్‌ వైద్యుల కమిటీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో కేజ్రీవాల్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు అరగంట పాటు ఎయిమ్స్‌ వైద్యులు సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘‘కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని వైద్యుల బృందం సూచించింది. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్‌ డోసు ఇవ్వాలని తెలిపింది’’అని ఆ వర్గాలు వెల్లడించాయి. వారం తర్వాత మరోసారి కేజ్రీవాల్‌ను వైద్యుల కమిటీ పరీక్షించనుందని పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని