Fuel Prices: ఇంధన మంట.. ప్రజల తంటా..!

పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఇప్పుడిప్పుడే ఊరట లభించేలా కనిపించడంలేదు. చమురు ధరలు నిర్విరామంగా పెరుగుతూ వాహనదారుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి....

Updated : 06 Jul 2021 14:06 IST

ధరల పెరుగుదలతో సామాన్యుడి ఆపసోపాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఇప్పుడిప్పుడే ఊరట లభించేలా కనిపించడంలేదు. చమురు ధరలు నిర్విరామంగా పెరుగుతూ వాహనదారుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి. రెండు నెలల క్రితం మొదలైన ఇంధన ధరల పెంపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండు నెలల కాలంలో లీటర్ పెట్రోల్‌పై చమురు సంస్థలు దాదాపు రూ.10 పెంచగా.. లీటర్ డీజిల్‌పై రూ.9 పెంచాయి. నిరంతర ప్రక్రియలా మారిపోయిన పెట్రో ధరల బాదుడుతో బండి బయటికి తీయాలంటేనే వాహనదారుడి గుండె గుబేలుమంటోంది. ఎలాంటి వాహనాలూ లేని సాధారణ పౌరుడు కూడా పెట్రో బాదుడుకు బాధితుడిగా మారుతున్నాడు.

దేశంలో ఇంధన ధరల పెరుగుదల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పౌరులపై ఆర్థిక భారం మోపుతోంది. డీజిల్‌ ధరలు పెరగడంతో రవాణా ధరలు తడిసి మోపెడవుతున్నాయి. ఈ పెరుగుదల నిత్యావసరాలపై ప్రభావం చూపుతోంది. దీంతో నిత్యావసరాలైన కూరగాయలు, ఇతర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఔషధాల ధరలు సైతం అమాంతం పెరిగిపోయాయి. దీంతో నిత్యావసరాలు కొనేందుకు పేదలు ఆపసోపాలు పడుతున్నారు. కొన్ని సరకులు కొనేందుకు ముందుకు రావడంలేదు. డీజిల్‌ ధరల పెరుగుదలతో పలు రాష్ట్రాల్లో బస్‌ ఛార్జీలు, ఆటో ఛార్జీలు కూడా పెరిగిపోయాయి.

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సమయంలో వరుసగా 18 రోజులపాటు స్థిరంగా ఉన్న ఆ తర్వాత మే 4 నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం పెట్రోల్‌పై రూ.35 సైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మే నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 35 సార్లు పెట్రోల్‌ ధరల్ని పెంచగా డీజిల్‌ ధరలను 33 సార్లు పెంచింది. దీంతో ఇప్పటికే 14 రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర సెంచరీ దాటింది. రాజస్థాన్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌లో లీటర్‌ డీజిల్‌ ధర కూడా రూ.100 దాటింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతోనే దేశీయంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని