బెంగాల్‌ ఎన్నికల బరిలో అయిషీ ఘోష్‌ 

మరో విద్యార్థి నాయకురాలు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ పశ్చిమ బెంగాల్‌ శాసనసభ

Published : 12 Mar 2021 01:19 IST

కోల్‌కతా: మరో విద్యార్థి నాయకురాలు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీపీఎం తరఫున ఆమె బరిలోకి దిగుతున్నారు. ఈ విషయాన్ని అయిషీ నేడు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘సంయుక్త మోర్చా మద్దతుతో జమురియా శాసనసభ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నాకు అండగా ఉండాలని ప్రతిఒక్కరిని కోరుతున్నా’’ అని అయిషీ ట్వీట్‌ చేశారు. 

గతేడాది జేఎన్‌యూ ప్రాంగణంలో జరిగిన హింసాత్మక దాడిలో అయిషీ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కొంతమంది ఆగంతకులు యూనివర్శిటీ క్యాంపస్‌లోకి చొరబడి ఇనుపరాడ్లు, గాజు సీసాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడికి పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. ఏబీవీపీ కార్యకర్తలే తమపై దాడి చేశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపించింది. అయితే ఈ ఘటన అనంతరం అయిషీపైనా కేసు నమోదైంది. దాడి ఘటనకు ఒకరోజు ముందు వర్సిటీ సర్వర్‌ రూంను ధ్వంసం చేసినందుకు గానూ.. అయిషీ సహా పలువురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జేఎస్‌యూ విద్యార్థి సంఘం తొలి సిట్టింగ్‌ అధ్యక్షురాలు ఈమే కావడం విశేషం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌.. బిహార్‌లోని బెగుసరయ్‌ నుంచి వామపక్ష అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని