Cash for Query: నవంబరు 2న.. లోక్‌సభ కమిటీ ముందుకు మహువా మొయిత్రా

నవంబరు 2న లోక్‌సభ నైతిక విలువల కమిటీ ముందు విచారణకు హాజరవుతానని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు.

Published : 31 Oct 2023 18:44 IST

దిల్లీ: పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra).. లోక్‌సభ నైతిక విలువల కమిటీ ముందు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. కమిటీ ఆదేశించినట్లుగానే నవంబరు 2న విచారణకు రానున్నట్లు వెల్లడించారు. అయితే.. నేరారోపణలను విచారించేందుకు లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ (Lok Sabha Ethics Committee) సరైన వేదికేనా? అని మహువా ప్రశ్నించారు. పార్లమెంటరీ కమిటీలకు నేరారోపణలను విచారించే అధికార పరిధి (Criminal Jurisdiction) లేదని పేర్కొంటూ.. ఇటువంటి కేసుల్లో దర్యాప్తు సంస్థలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే.. వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీని కూడా విచారణకు పిలవాలని విజ్ఞప్తి చేశారు.

అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేలా ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి మహువా రూ.2 కోట్లతోపాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే ఇటీవల ఆరోపించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయగా.. ఈ వ్యవహారం లోక్‌సభ నైతిక విలువల కమిటీ వద్దకు చేరింది. తొలుత అక్టోబరు 31నే విచారణకు హాజరు కావాలని కమిటీ ఆదేశించింది. అయితే, ముందుగా షెడ్యూల్‌ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, నవంబరు 5 తర్వాత తేదీని ఖరారు చేయాలని మహువా అభ్యర్థించారు. అయితే.. మహువా విజ్ఞప్తిని తోసిపుచ్చిన కమిటీ.. నవంబరు 2న తమ ముందుకు వచ్చి మౌఖిక సాక్ష్యం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

అవును..లాగిన్‌ నేనే ఇచ్చా: మహువా మొయిత్రా

ఈ క్రమంలోనే మహువా స్పందిస్తూ.. తాను సమన్లను గౌరవిస్తానని, నవంబర్ 2 ఉదయం 11 గంటలకు కమిటీ ముందు హాజరవుతానని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో నిషికాంత్‌ దూబే, న్యాయవాది జై అనంత్‌ దేహాద్రాయ్‌లు ఇప్పటికే కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. మరోవైపు.. తాను దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్న 18 వార్తాసంస్థలు, ఆన్‌లైన్‌ వేదికల పేర్లను తొలగించే అవకాశం ఇవ్వాలని మహువా చేసిన విజ్ఞప్తికి దిల్లీ హైకోర్టు అనుమతించింది. కేవలం నిషికాంత్‌ దూబే, జై అనంత్‌ దేహద్రాయ్‌లపైనే ఈ కేసులో పోరాడనున్నట్లు మహువా తరఫు న్యాయవాది తెలిపారు. డిసెంబరులో ఈ పిటిషన్‌ విచారణ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని