icon icon icon
icon icon icon

Andhra news: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం.. సీఎస్‌, డీజీపీకి సమన్లు

పల్నాడు, చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 15 May 2024 15:54 IST

అమరావతి: పల్నాడు, చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లోనూ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాలను ఆదేశించింది. ఈ ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ సమన్లు పంపింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలు ఉన్నా .. పోలింగ్ రోజు అంత నిర్లిప్తంగా ఎందుకు వ్యవహరించారని ఈసీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈమేరకు ఇద్దరు అధికారులు గురువారం దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు. ఎన్నికలతో పాటు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపట్ల స్థానిక అధికారులు నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వదిలేసినట్టు ఈసీ గుర్తించింది. పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సీఈసీకి నివేదించినట్టు తెలుస్తోంది. 

చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం..

పోలింగ్‌ అనంతరం మంగళవారం తాడిపత్రి, తిరుపతి, కారంపూడి రణరంగంగా మారాయి. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం ఆవరణలో వైకాపా నాయకులు మారణాయుధాలతో రెచ్చిపోయారు. ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు. చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. ఆయన కుమారుడు, ప్రస్తుతం పార్టీ అభ్యర్థి మోహిత్‌రెడ్డిల అనుచరులు సమ్మెట, కర్రలు, రాళ్లు, బీరు సీసాలతో దాడులు చేస్తూ వీరంగం సృష్టించారు. నానితోపాటు ఆయన డ్రైవర్‌, గన్‌మెన్లపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తేరుకునేలోగానే దుండగులు దాడి చేయడంతో గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. వెరవకుండా వైకాపా మూకలు దాడిని కొనసాగించడంతో నాని భుజానికి గాయాలయ్యాయి. గన్‌మెన్‌ తలకూ తీవ్రగాయమైంది.

కారంపూడిలో విధ్వంస కాండ...

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో విధ్వంసం సృష్టించారు. తన కారుపై ఎవరో రాయి వేశారనే నెపంతో తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కారంపూడి మీదుగా వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని ఓ కారుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడనే నెపంతో ఆగ్రహంతో ఊగిపోయారు. సమీపంలోనే ఉన్న తెదేపా కార్యాలయం వైపు కాన్వాయ్‌ వెళ్లి ఆగింది. కార్లలో ఉన్న వైకాపా గూండాలు కర్రలు, కత్తులు, రాడ్లు బయటకు తీసి తెదేపా కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కుర్చీలను పగలగొట్టారు. రాళ్లు విసిరారు. ఫ్లెక్సీలను చించేశారు. తలుపులు ధ్వంసం చేశారు. అటుగా కారులో వెళ్తున్న తెదేపా కార్యకర్త మస్తాన్‌ జానీబాషా కుమారుడు బుడ్డు, షేక్‌జాన్‌ను అడ్డుకున్నారు. వారిని బయటకు రప్పించి దాడి చేసి, ఆపై కారుకు నిప్పుపెట్టారు. రోడ్లపై తిరుగుతూ బీభత్సం సృష్టించారు. దుకాణదారులపైనా దాడులకు తెగబడ్డారు. పున్నమ్మ తోపుడు (టిఫిన్‌ అమ్ముకునే)బండిని విరగ్గొట్టారు. అక్కడే కూర్చొని ఉన్న ఆమె కుమార్తె, మనవరాలిపై దాడి చేశారు.

యుద్ధభూమిగా తాడిపత్రి..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల ముందు అన్నట్లుగానే విధ్వంసకాండను సృష్టించారు. తాడిపత్రిని యుద్ధభూమిగా మార్చారు. తాడిపత్రిలోని చింతలరాయుని పాళెంలో ఉన్న వైకాపా ఏజెంట్లు సంజీవ, అజయ్‌, మరో నలుగురు కలసి తెదేపా ఏజెంట్‌ భాను, ఆ పార్టీ వర్గీయుడు మోహన్‌లపై దాడికి దిగారు. అంతలో తెదేపా నాయకుడు సూర్యముని అనుచరులు వైకాపా ఏజెంట్‌ సంజీవను నిలదీయగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయి నా వర్గీయుడినే ప్రశ్నిస్తారా? అని తన అనుచరులతో సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి రాళ్లదాడికి దిగారు. స్పెషల్‌ కమాండెంట్‌ శ్రీనివాసరావు.. బలగాలతో వెళ్లి అల్లరి మూకలను చెదరగొట్టారు. వైకాపా మూకల దాడిలో ఆయనతోపాటు పట్టణ సీఐ మురళీకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి.

 ఇద్దరు కానిస్టేబుళ్లూ గాయపడ్డారు. ఈ విషయం తెలియగానే మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి సూర్యముని ఇంటి వద్దకు వచ్చి పరామర్శించారు. ఆ తర్వాత తెదేపా వర్గీయులు పెద్దారెడ్డి అరాచకాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలోకి చేరుకోగా, అక్కడ దాడికి పక్కా వ్యూహంతో ఉన్న వైకాపా వర్గీయులు ట్రాక్టర్లతో రాళ్లను తెప్పించుకుని తెదేపా వారిపైకి విసిరారు. తెదేపా వర్గీయులపై బాణసంచా పేల్చారు. కేంద్ర బలగాలు రంగ ప్రవేశం చేసి అల్లరి మూకలను చెదరగొట్టాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img