మాజీ ప్రధాని మన్మోహన్‌కు కరోనా పాజిటివ్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కరోనా బారినపడ్డారు

Updated : 19 Apr 2021 19:42 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ కరోనా బారిన పడ్డారు. జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఈ సాయంత్రం 5గంటల సమయంలో దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. మన్మోహన్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు  కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌లో వెల్లడించింది. ఆయన త్వరగా.. పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మన్మోహన్‌ సింగ్ ఇప్పటికే రెండో డోసుల టీకా వేయించుకున్నారు. తొలి డోసు మార్చి 4న వేయించుకోగా.. రెండో డోసును ఏప్రిల్‌ 3న తీసుకున్నారు. మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలను ఎయిమ్స్ వైద్యులు‌ వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం వేగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వానికి మన్మోహన్‌ సింగ్ పలు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాశారు. టీకాలు ఎంతమందికి ఇచ్చామని కాకుండా జనాభాలో ఎంత శాతం మందికి ఇచ్చామన్నదే పరిగణనలోకి తీసుకోవాలని మోదీకి సూచించారు.

త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖుల ట్వీట్లు..

మన్మోహన్‌ సింగ్‌ కరోనా బారినపడటంపై పలువురు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.  త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌తో పాటు భాజపా నేత, కేంద్రమంత్రి  నితిన్‌ గడ్కరీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు నేతలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి కష్ట సమయంలో భారతదేశానికి మీ మార్గదర్శకత్వాన్ని, సలహాలు ఎంతో అవసరం అంటూ రాహుల్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని