Cheetah: ఆ నమీబియా చీతాల్లో.. ‘సాశా’ మృత్యువాత

గతేడాది నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన ఎనిమిది చీతాల్లో ఒకటి సోమవారం మృత్యువాతపడింది. కిడ్నీ సంబంధిత సమస్యలతో ‘సాశా’ అనే ఆడ చీతా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

Published : 27 Mar 2023 20:24 IST

భోపాల్‌: గతేడాది సెప్టెంబరులో నమీబియా(Namibia) నుంచి మన దేశానికి ఎనిమిది చీతాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ వాటిని మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) కునో జాతీయ పార్కు(Kuno National Park)లోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. అయితే, వాటిలో ‘సాశా(Sasha)’ అనే ఆడ చీతా సోమవారం అనారోగ్యంతో మృత్యువాత పడింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో అది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

‘జనవరి 22న ‘సాశా’ అస్వస్థతతో కనిపించింది. దీంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం క్వారంటైన్‌లోకి తరలించాం. రక్తపరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లో ఆ చీతాకు మూత్రపిండాల సమస్య ఉన్నట్లు తేలింది. దాని ఆరోగ్య చరిత్రను పూర్తిస్థాయిలో విశ్లేషించగా.. భారత్‌కు తీసుకొచ్చే ముందే ఈ సమస్య ఉన్నట్లు తేలింది. స్థానిక వైద్యులతోపాటు నమీబియా, దక్షిణాఫ్రికాలకు చెందిన నిపుణులు నిత్యం వైద్యసేవలు అందించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి సోమవారం మరణించింది’ అని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

నమీబియా నుంచి 4- 6 ఏళ్ల వయసున్న ఐదు ఆడ, మూడు మగ.. మొత్తం ఎనిమిది చీతాలు వచ్చాయి. మిగతా ఏడు చీతాల్లో .. మూడు మగ, ఒక ఆడ చీత ప్రస్తుతం కునో జాతీయ పార్కులో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ‘మిగతా ఏడు చీతాలు ఆరోగ్యంగా ఉన్నాయి. వేట కొనసాగిస్తున్నాయి. దీంతోపాటు ఇటీవల దక్షిణాఫ్రికానుంచి తీసుకొచ్చిన 12 చీతాలు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఆరోగ్యంగా ఉన్నాయి’ అని కునో జాతీయ పార్కు అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని