Farm Laws: కొత్త చట్టాలతో రైతులకే ప్రయోజనం!

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు మార్కెట్‌లో పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా రైతులకు మెరుగైన దిగుబడి సాధించడంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌ పేర్కొన్నారు.

Published : 12 Jul 2021 21:02 IST

కేంద్రప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కె సుబ్రమణ్యన్‌

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు మార్కెట్‌లో పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా రైతులకు మెరుగైన దిగుబడి సాధించడంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా రైతులు తమ ఉత్పత్తులను రిలయన్స్‌, ఐటీసీ వంటి కార్పొరేట్‌ సంస్థలకు నేరుగా విక్రయించే వెసులుబాటు కలుగుతుందని స్పష్టం చేశారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని మెరుగుపరచుకోవడంలో నూతన సాగు చట్టాలు మరో ముందడుగు అని కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌ అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్‌ కమిటీల (APMC) ద్వారా తమ ఉత్పత్తులను అమ్ముకోవాలని రైతులను ఒత్తిడి చేయడం వల్ల వారికి కలిగే నష్టాలే ఎక్కువ అని కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త వ్యవసాయ చట్టాలు మార్కెట్‌లో పోటీతత్వాన్ని కలిగిస్తాయని అన్నారు. ఒకవేళ ఒక మధ్యవర్తి సరైన మద్దతు ధర ఇవ్వకుంటే రైతు నేరుగా రిలయన్స్‌, ఐటీసీ లేదా ఇతర మార్కెట్‌లో నేరుగా వారి ఉత్పత్తులను అమ్ముకోవచ్చని కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌ పేర్కొన్నారు. నాబార్డ్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మార్కెట్‌లో పోటీతత్వం వల్లే బ్యాంకింగ్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, టెలికాం, ఎయిర్‌పోర్టు రంగాలు విజయాలను సొంతం చేసుకుంటున్నాయని గుర్తుచేశారు.

దేశంలో వ్యవసాయ రంగంలో సంస్కరణల్లో భాగంగా కేంద్రప్రభుత్వం గతేడాది కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, వాటిపై దేశవ్యాప్తంగా రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వాటి అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ సాగు చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌, హరియాణాతో పాటు పలు రాష్ట్రాల రైతులు దిల్లీ సరిహద్దుల్లో గడిచిన ఆరేడు నెలలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని