Bihar Caste survey: బిహార్‌లో ఓబీసీ, ఈబీసీలే 63%.. కులగణన సర్వేలో వెల్లడి

Bihar Caste survey: కులగణన నివేదిక నేపథ్యంలో.. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సీఎం నీతీశ్‌ కుమార్‌ సోమవారం ఉదయం మీడియాతో వెల్లడించారు.

Updated : 02 Oct 2023 14:44 IST

పట్నా: బిహార్‌లో కులగణన సర్వే (Bihar Caste survey) నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు (OBCs), అత్యంత వెనుకబడిన తరగతులు (Extremely Backward Classes- EBCs) కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్టును రాష్ట్ర డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ వివేక్‌ సింగ్‌ సోమవారం విడుదల చేశారు.

తాజా నివేదిక (Bihar Caste survey) ప్రకారం బిహార్‌ రాష్ట్ర జనాభా దాదాపు 13.07 కోట్లు. వీరిలో అత్యంత వెనుబడిన తరగతుల (EBCs) వారు 36 శాతంగా ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల (OBCs) వారి వాటా 27.13 శాతంగా తేలింది. కులాలవారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. మొత్తం రాష్ట్ర జనాభాలో వీరి వాటా 14.27 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. షెడ్యూల్డ్‌ కులాల (SCs) జనాభా 19.7 శాతం, షెడ్యూల్డ్‌ తెగల (STs) జనాభా 1.7 శాతంగా నమోదైంది. జనరల్‌ కేటగిరీకి చెందినవారి జనాభా 15.5 శాతంగా ఉన్నట్లు తేలింది.

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో, రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, కులగణను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ సర్వేకు అనుమతించింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది.

కులగణన నివేదిక (Bihar Caste survey) నేపథ్యంలో.. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సీఎం నీతీశ్‌ కుమార్‌ సోమవారం ఉదయం మీడియాతో అన్నారు. ఈ భేటీలో కులగణన నివేదికపై చర్చిస్తామన్నారు. ఓబీసీ కోటా పెంపు సహా ఇతరత్రా అంశాలపై సమాలోచనలు జరుపుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని