Updated : 05 Aug 2022 11:48 IST

Rahul Gandhi: ముగ్గురు వ్యక్తుల కోసం ఇద్దరి నియంతృత్వ పాలన..!

నిర్మలా సీతారామన్ ఒక మౌత్‌ పీస్‌: రాహుల్ 

దిల్లీ: పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరుగుదలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు దిగింది. నేటి నుంచి పదకొండు రోజుల పాటు వివిధ రూపాల్లో ఈ నిరసనలు కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, పలువురు సీనియర్ నేతలు మీడియా సమావేశం నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసించారు. విపక్షాలపై ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోన్న తీరు నియంతృత్వ పాలన ప్రారంభాన్ని సూచిస్తోందని రాహుల్ మండిపడ్డారు. 

‘ధరల పెరుగుదల, నిరుద్యోగం, సమాజంలో చోటుచేసుకుంటున్న హింస వంటి ప్రజా సమస్యలు లేవనెత్తకూడదు. వాటిని ప్రశ్నిస్తే అణచివేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదు. దశాబ్దాల క్రితం ఒక్కో ఇటుక పేర్చి ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్యాన్ని మనముందే కూల్చివేస్తున్నారు. ఈ వ్యవహారశైలి.. నియంతృత్వ పాలన ప్రారంభానికి సూచన.  నలుగురైదుగురు ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ ప్రభుత్వం నడుస్తోంది. ఇద్దరు ముగ్గురు వ్యాపారుల కోసం ఇద్దరు వ్యక్తులు నియంతృత్వ పాలనకు పాల్పడుతున్నారు. నేను ఇలా ఎంత ఎక్కువగా ప్రశ్నిస్తే.. నాపై అంత ఎక్కువ దాడి జరుగుతుంది’ అంటూ రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

ఆమె ఒక మౌత్ పీస్‌..  
‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మౌత్‌పీస్‌. దేశ ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతుందో ఆమెకు అవగాహన ఉందనుకోవడం లేదు’ అని రాహుల్‌ అన్నారు. 

ఇది కుటుంబం కాదు.. ఒక ఐడియాలజీ..

‘ఆర్‌ఎస్‌ఎస్‌ ఐడియాలజీని నేను వ్యతిరేకిస్తాను. నా కుటుంబం ప్రాణత్యాగాలు చేసింది. సిద్ధాంతం కోసం పోరాడినప్పుడు ఇది మా బాధ్యత. ఇది ఒక కుటుంబం కాదు. ఇది ఒక ఐడియాలజీ. హిట్లర్ కూడా ఎన్నికల్లో గెలిచేవాడు. ప్రతిసారి ఆయన ఎన్నికల్లో విజయం సాధించేవాడు. జర్మనీ వ్యవస్థలన్నింటిని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. మొత్తం వ్యవస్థను నాకు అప్పగించండి. ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారో చూపిస్తాను’ అని రాహుల్‌ అన్నారు.

ఈడీని కించపర్చడం ఆపండి: భాజపా

రాహుల్‌ వ్యాఖ్యలపై భాజపా నేతలు మండిపడ్డారు. ‘మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఈడీని కించపర్చడం మానండి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యయిక పరిస్థితిని విధించినట్లే.. రాహుల్ మీడియా, ఈడీని బెదిరిస్తున్నారు’అని కాంగ్రెస్ విమర్శలను భాజపా తిప్పికొట్టింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని