Bilkis Bano: బిల్కిస్‌ బానో పిటిషన్‌.. భావోద్వేగాలతో తీర్పు ఇవ్వలేం: సుప్రీం

బిల్కిస్‌ బానో (Bilkis Bano) పిటిషన్‌పై భావోద్వేగాలకు లోబడి తాము తీర్పు ఇవ్వలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో సవివరంగా విచారణ జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.

Published : 27 Mar 2023 19:28 IST

దిల్లీ: తనపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ బాధితురాలు బిల్కిస్‌ బానో (Bilkis Bano) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) నేడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, గుజరాత్‌ ప్రభుత్వానికి (Gujarat Govt) నోటీసులు జారీ చేసింది. ఈ కేసు అనేక అంశాలతో ముడిపడి ఉన్నందున.. దీన్ని సవివరంగా విచారించాల్సిన అవసరముందని జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

దోషులకు రెమిషన్‌ (Remission) మంజూరు చట్టప్రకారం జరిగిందా? అని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. ‘‘హత్య నేరాలు ఎంతో మంది దోషులు రెమిషన్‌ లేక ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న కేసులున్నాయి. ఇతర కేసుల మాదిరిగానే ఈ కేసులో నిందితులకు రెమిషన్‌ మంజూరు చేసేందుకు ఉన్న నిబంధనలను పాటించారా?’’ అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్‌ 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆ తేదీ నాటికి.. దోషులకు రెమిషన్‌ మంజూరుకు సంబంధించిన ఫైళ్లతో సిద్ధంగా ఉండాలని కేంద్రం, గుజరాత్‌ సర్కారును ఆదేశించింది. ‘‘ఈ కేసులో భావోద్వేగాలకు లోబడి మేం తీర్పు ఇవ్వలేం. చట్టప్రకారమే ముందుకెళ్తాం’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

2002లో గోద్రా రైలు దహనకాండ (Godhra Train Incident) అనంతరం గుజరాత్‌లో అల్లర్లు (Gujarat Riots) జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో(Bilkis Bano) కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. అయితే 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వారికి గతేడాది ఆగస్టు 15న గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేసింది.

దోషులు జైలు నుంచి విడుదలైన తర్వాత వారిని పూలమాలలతో సత్కరించడం, మిఠాయిలు పంచడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే దోషులకు రెమిషన్‌ (Remission)ను సవాల్‌ చేస్తూ బిల్కిస్‌ బానో సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, దీనిపై గతంలో స్పందించిన గుజరాత్‌ ప్రభుత్వం.. దోషుల సత్ప్రవర్తన ఆధారంగానే ముందస్తు విడుదలకు అంగీకరించినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని