Modi Meet on Afghan: అఫ్గాన్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష!

అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రులు, అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Published : 17 Aug 2021 20:09 IST

ఎంబసీ సిబ్బంది తరలింపు పూర్తయ్యిందన్న విదేశాంగశాఖ

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రులు, అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడంతో పాటు తాలిబన్‌ నాయకత్వంపై వ్యవహరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఎంబసీ సిబ్బంది తరలింపు పూర్తి..

అఫ్గానిస్థాన్‌ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారత రాయబార సిబ్బందితోపాటు పౌరులను తరలించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో కాబుల్‌ నుంచి సాధారణ విమాన సేవలు నిలిచిపోవడంతో భారత వాయుసేన విమానం రంగంలోకి దిగింది. అమెరికా బలగాలతో పాటు అఫ్గాన్‌ అధికారుల సహకారంతో కాబుల్‌లోని భారత ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తీసుకువచ్చినట్లు భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జయశంకర్‌ పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో ఎంబసీ సిబ్బందిని తీసుకువచ్చే సంక్లిష్టమైన ఆపరేషన్‌కు సహకారం అందించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అఫ్గాన్‌ నుంచి స్వదేశానికి రావాలనుకున్న భారతీయులను కూడా తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని విదేశాంగమంత్రి జయశంకర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని