Aamir Khan: ఆమిర్‌... సితారే జమీన్‌ పర్‌

‘లాల్‌ సింగ్‌ చద్దా’ తర్వాత గత కొన్ని రోజులుగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌.

Updated : 13 Oct 2023 12:42 IST

‘లాల్‌ సింగ్‌ చద్దా’ తర్వాత గత కొన్ని రోజులుగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌. మరో సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతున్నారాయన. తాజాగా ఆయన తన తదుపరి ‘సితారే జమీన్‌ పర్‌’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా ‘తారే జమీన్‌ పర్‌’ తరహాలో ఉంటుందని అన్నారు. ‘నేను నటించిన చిత్రం ‘తారే జమీన్‌ పర్‌’ని గుర్తుపెట్టుకొనే ఉంటారు. ఆ చిత్రం మిమ్మల్ని ఏడిపించింది. కానీ ఇప్పుడు రాబోయే చిత్రం అందరినీ నవ్విస్తూ.. అలరిస్తుంది. కానీ థీమ్‌ ఒక్కటే. ఈ పేరును చాలా ఆలోచించి పెట్టాము. మనందరికీ లోపాలు, బలహీనతలు ఉంటాయి. అదే విధంగా ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో రాబోయే చిత్రం రూపొందుతుంది. ఇంతకు ముందు చిత్రంలో ఇషాన్‌ అనే అబ్బాయికి నా పాత్ర సహాయం చేస్తుంది. ఈ చిత్రం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు ఆమిర్‌. ‘తారే జమీన్‌ పర్‌’... 2007లో విడుదలైన ఈ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. డైస్లెక్సియా కారణంగా చదువుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇషాన్‌ అనే బాలుడి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని