Mehreen: వైవాహిక అత్యాచారాన్ని.. శృంగార సీన్లు అంటారా?: మెహ్రీన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

ఇప్పటి వరకు సినిమాలతో అలరించిన మెహ్రీన్ ఇప్పుడు ఓటీటీలోనూ ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. తాజాగా నటించిన ఓ వెబ్‌ సిరీస్‌లోని సన్నివేశాలను నెటిజన్లు ట్రోల్ చేయడంపై అసహనం వ్యక్తం చేసింది.

Published : 18 Oct 2023 11:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శృంగార సన్నివేశాల్లో నటించడం కూడా వృత్తిలో భాగమేనని నటి మెహ్రీన్‌ (Mehreen) వెల్లడించింది. తాను నటించిన సరికొత్త వెబ్‌ సిరీస్‌లో వైవాహిక అత్యాచారాన్ని శృంగార సన్నివేశాలుగా నెటిజన్లు అభివర్ణించడం తనకు బాధ కలిగించిందని చెప్పింది. తాజాగా ఆమె ‘సుల్తాన్‌ ఆఫ్‌ దిల్లీ’ అనే వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సిరీస్‌లో కొన్ని సన్నివేశాల్లో నటించినందుకు నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్‌ చేశారు. దీనిపై ఆమె సోషల్‌మీడియా వేదికగా స్పందించింది. వాళ్లకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తూ ఎక్స్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. 

‘‘సుల్తాన్ ఆఫ్‌ దిల్లీ’ (Sultan of Delhi) వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి అరంగేట్రం చేశాను. నా అభిమానులు దాన్ని చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నా. కొన్ని సార్లు స్క్రిప్ట్‌ కోసం మన సొంత భావాలకు విరుద్ధంగా నటించాల్సి వస్తుంది. నటనను ఒక కళగా, ఉద్యోగంగా భావించే నటులు కథలో భాగంగా కొన్ని సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది. శృంగార సన్నివేశాల్లో నటించడం కూడా అందులో ఓ భాగం. ఈ సిరీస్‌లో దిల్లీ సుల్తాన్‌ క్రూరమైన వైవాహిక అత్యాచారాన్ని చిత్రీకరించే సన్నివేశం ఉంది. వైవాహిక అత్యాచారం వంటి తీవ్రమైన సమస్యను మీడియాలో చాలా మంది ఒక శృంగార సన్నివేశంగా అభివర్ణించడం బాధాకరం. ప్రపంచంలో చాలా మంది మహిళలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్ని చాలా మంది చిన్న విషయంగా భావించారు. అలాగే సోషల్‌మీడియాలోని వ్యక్తులు దీని గురించి దారుణంగా ట్రోల్ చేయడం నన్ను కలవరపెట్టింది. అలా మాట్లాడే వాళ్లకు కూడా అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు ఉంటారు. వాళ్లకు ఇలాంటి బాధ ఎదురుకాకూడదని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మహిళలతో క్రూరంగా ప్రవర్తించడం, వారిని హింసించడం నా దృష్టిలో ఒక అసహ్యకరమైన చర్య. 

నువ్వు.. ఈ ప్రశ్న అడగొచ్చా?: అభిమానితో రవితేజ

అలాగే అటువంటి సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో నటీనటులకు అసౌకర్యం కలగకుండా చిత్రబృందం ఎంతో శ్రమిస్తుంది. ఈ వెబ్‌సిరీస్ టీమ్‌ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎంతో ప్రొఫెషనల్‌గా ఉన్నారు. నటిగా నేను ప్రతి పాత్రకు న్యాయం చేయాలనుకుంటా. మహాలక్ష్మి, సంజన, హనీ.. ఇలా ఏ పాత్రలోనైనా సత్తా చాటాలని ప్రయత్నిస్తాను’’ అని మెహ్రీన్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని