Tollywood: జై జవాన్‌.. రయ్‌ నాయక్‌

ట్రెండ్‌లో భాగమైనా కావొచ్చు... లేక  యాదృచ్చికంగానూ కావొచ్చు... మన కథానాయకులు అప్పుడప్పుడూ ఒకే రకమైన పాత్రల్లో దర్శనమిస్తుంటారు.   ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. ఇప్పుడూ కొన్ని పాత్రలు అలాంటి ఆసక్తినే రేకెత్తిస్తున్నాయి.

Updated : 21 Apr 2022 11:03 IST

ట్రెండ్‌లో భాగమైనా కావొచ్చు... లేక  యాదృచ్చికంగానూ కావొచ్చు... మన కథానాయకులు అప్పుడప్పుడూ ఒకే రకమైన పాత్రల్లో దర్శనమిస్తుంటారు.   ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. ఇప్పుడూ కొన్ని పాత్రలు అలాంటి ఆసక్తినే రేకెత్తిస్తున్నాయి. పలువురు కథానాయకులు ఆర్మీ అధికారుల పాత్రల్లో కనిపిస్తుండటమే అందుకు కారణం.

ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో పోరాటం చేసే సైనికుల స్ఫూర్తి గాథలతో ఎన్నో సినిమాలు రూపొందాయి. దేశభక్తితోపాటు, వీరోచిత విన్యాసాలతో హీరోయిజాన్ని ఆవిష్కరించేందుకూ ఈ కథల్లో ఆస్కారం ఉంటుంది. నవతరం దర్శకులు వాటికితోడు కుటుంబ కథలు, ప్రేమకథలు, మాస్‌ కథల్నీ ఈ నేపథ్యంలోనే చెప్పే ప్రయత్నం చేస్తుండడం నేటి ట్రెండ్‌‘. ‘వెంకీ మామ’, ‘సరిలేరు నీకెవ్వరు’ తదితర చిత్రాలు ఆ కోవకి చెందినవే!


* విజయ్‌ దేవరకొండ ఆర్మీ నేపథ్యంలో సాగే కథల్లోనే నటిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనగణమన’ చిత్రంలో విజయ్‌ ఆర్మీ అధికారిగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ చేయనున్న కొత్త చిత్రమూ ఆర్మీ నేపథ్యంలోనే సాగే రొమాంటిక్‌ ప్రేమ కథగా రూపొందుతున్నట్టు సమాచారం. ఇందులో కథానాయిక సమంత కశ్మీరీ యువతిగా కనిపించనున్నట్టు తెలిసింది.


* యువ దర్శకుడు హను రాఘవపూడి ‘సీతారామం’ పేరుతో దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా ఓ ప్రేమకథని తెరకెక్కిస్తున్నారు. అది ఆర్మీ నేపథ్యంలో సాగే కథే. ఇందులో దుల్కర్‌ లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో నటిస్తున్నారు. కశ్మీరీ యువతిగా కథానాయిక రష్మిక మందన్న నటిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది.


* ‘వెంకీమామ’లో ఇప్పటికే జవాన్‌గా కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించిన నాగచైతన్య... ఆమిర్‌ఖాన్‌తో కలిసి నటించిన ‘లాల్‌సింగ్‌ చద్ధా’లోనూ సైనికుడిగా మెరవనున్నారు. ‘మేజర్‌’ కోసం అడివి శేష్‌ యుద్ధవీరుడిగానే కనిపించనున్నారు. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథతో ‘మేజర్‌’ రూపొందుతున్న సంగతి తెలిసిందే.


* నవతరం ఎక్కువగా ఇష్టపడుతున్న స్పై కథల్లోనూ దేశభక్తి ప్రధానమైన అంశాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలోనూ కథానాయకుడు సైనికుడిలా పోరాటం చేస్తుంటారు. ఆ తరహా కథలతోనే ప్రస్తుతం ‘ఏజెంట్‌’, ‘స్పై’ తదితర చిత్రాలు రూపొందుతున్నాయి. అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏజెంట్‌’లోనూ బలమైన ఆర్మీ అధికారి పాత్ర ఉంది. అందులో సీనియర్‌ నటుడు మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో స్పైగా కనిపించనున్న అఖిల్‌ గన్‌ చేతపట్టి కనిపిస్తున్నారు. చూస్తుంటే ఆయన కూడా దేశరక్షణ కోసం రంగంలోకి దిగినట్టు స్పష్టమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని