
Bimbisara: ‘ఆచార్య’ పాత విడుదల తేదీపై కన్నేసిన బింబిసార?
హైదరాబాద్: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బింబిసార’. చారిత్రక నేపథ్యమున్న కథాంశంతో రాబోతున్న ఈ చిత్రానికి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, కరోనా నేపథ్యంలో పలు సినిమాల విడుదల తేదీల్లో మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉండగా.. ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా పడింది. దీంతో ఖాళీగా ఉన్న ఫిబ్రవరి 4వ తేదీన ‘బింబిసార’ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
కల్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కల్యాణ్ రామ్ బింబిసార అనే క్రూరమైన రాజుగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా కేథరిన్, సంయుక్త మేనన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. మొదటి భాగం విడుదలైన తర్వాత రెండో భాగం చిత్రీకరణ ప్రారంభించనున్నారు. రెండో భాగంలో ఓ ప్రముఖ నటుడు ప్రతినాయకుడిగా కనిపిస్తారని, భారీ తారగణం ఉండబోతోందని సమాచారం.