Tollywood: నాన్న.. భావోద్వేగాల జడివాన!

భారతీయ చిత్రాల్లో సాధారణంగానే కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఎక్కువ. ముఖ్యంగా తెలుగులో ఈ తరహా సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ కనిపిస్తుంటుంది. అమ్మానాన్న.. అన్నాచెల్లి.. అక్కాతమ్ముడు.. ఇలా ఏదోక సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకొని అల్లుకున్న సినిమాలు ఇక్కడ చాలానే వచ్చాయి.

Updated : 14 Aug 2023 11:30 IST

ఫాదర్‌ సెంటిమెంట్‌ బాటలో అగ్ర హీరోలు

భారతీయ చిత్రాల్లో సాధారణంగానే కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఎక్కువ. ముఖ్యంగా తెలుగులో ఈ తరహా సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ కనిపిస్తుంటుంది. అమ్మానాన్న.. అన్నాచెల్లి.. అక్కాతమ్ముడు.. ఇలా ఏదోక సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకొని అల్లుకున్న సినిమాలు ఇక్కడ చాలానే వచ్చాయి. ప్రత్యేకించి తండ్రీ బిడ్డల అనుబంధాలతో రూపొందిన చిత్రాల్లో గొప్ప విజయాన్ని దక్కించుకున్నవి చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో మాస్‌ యాక్షన్‌ చిత్రాలు.. సస్పెన్స్‌ థ్రిల్లర్ల జోరు పెరిగాక ఈ సెంటిమెంట్‌ కథల సందడి కాస్త తగ్గింది. అయితే ప్రస్తుతం పలువురు కథానాయకులు కొత్త జానర్లు ప్రయత్నిస్తూనే వాటికి ఫ్యామిలీ టచ్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి తండ్రి సెంటిమెంట్‌తో మదిని బరువెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం ‘జైలర్‌’గా థియేటర్లలో సందడి చేస్తున్నారు రజనీకాంత్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. ఇదొక వినూత్నమైన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబైనా.. ప్రధానంగా తండ్రీబిడ్డల సెంటిమెంట్‌తోనే ముడిపడి ఉంది. తన కొడుకును హత్య చేసిన నేరస్థుల్ని వేటాడుతూ.. ఓ రిటైర్డ్‌ జైలర్‌ చేసిన ప్రయాణమిది. దీన్ని తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించి ప్రేక్షకుల్ని మెప్పించారు నెల్సన్‌. ఇందులో రజనీ భార్యగా రమ్యకృష్ణ నటించగా.. తనయుడి పాత్రను వసంత్‌ రవి పోషించారు. కుటుంబ కథలకు అగ్ర తాంబూలం ఇచ్చే కథానాయకుల్లో ముందు వరసలో ఉంటారు వెంకటేష్‌. ఆయన ప్రస్తుతం శైలేష్‌ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్‌’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది వెంకటేష్‌కు తొలి పాన్‌ ఇండియా సినిమా. విభిన్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌ కీలకం కానుంది. ఇటీవలే ‘హార్ట్‌ ఆఫ్‌ సైంధవ్‌’ పేరుతో వెంకీ కూతురు పాత్రను చూపించారు. ఆ పాత్రను సినిమాలో బేబీ సారా పోషిస్తోంది. ఈ చిత్రం తాజాగా ఓ భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. 16రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌కు రామ్‌-లక్ష్మణ్‌ నేతృత్వం వహించారు. ఈ సినిమా డిసెంబరు 22న విడుదల కానుంది.


‘భగవంత్‌ కేసరి’ సర్‌ప్రైజ్‌ చేస్తాడా?

దసరా బరిలో ‘భగవంత్‌ కేసరి’గా సందడి చేయనున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. బాలయ్య మార్క్‌ యాక్షన్‌ చిత్రంగా ముస్తాబవుతోన్న ఈ సినిమాలో తండ్రీ బిడ్డల సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. అయితే దీంట్లో ఓ సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా అక్టోబరు 19న థియేటర్లలోకి రానుంది.


కుటుంబ బంధాలకు పెద్దపీట

క్రిస్మస్‌ బరిలోనే ‘హాయ్‌ నాన్న’ పేరుతో మరో తండ్రీ కూతుళ్ల కథను చూపించనున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కిస్తున్నారు. చెరుకూరి మోహన్‌, విజేందర్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఈ సినిమాను  ముస్తాబు చేస్తున్నట్లు ఇటీవల చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా డిసెంబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటించగా.. శ్రుతిహాసన్‌ కీలక పాత్ర పోషించింది. యువ హీరో సుధీర్‌బాబు ‘మామా మశ్చీంద్ర’తో పాటు ‘హరోం హర’ అనే సినిమాతో సెట్స్‌పై తీరిక లేకుండా ఉన్నారు. వీటితో పాటు అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఇదీ ఫాదర్‌ సెంటిమెంట్‌తో రూపొందుతున్న సినిమానే. అందుకే ఈ చిత్రానికి ‘మా నాన్న సూపర్‌ హీరో’ అనే పేరుని ఖరారు చేశారు. ఈ సినిమాని సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. చిత్రసీమలో ఏ ట్రెండ్‌ నడుస్తున్నా.. ఎలాంటి జానర్లు గారడి చేస్తున్నా.. ఫ్యామిలీ టచ్‌ ఉన్న కథలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. పైగా అది వెండితెరపై విజయవంతమైన ఫార్ములా. అందుకే కథానాయకులు కొత్తదనం పంచిస్తూనే.. అందులో కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని