Rajamouli: ఎన్టీఆర్‌ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి

ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్‌ చేశారు.

Updated : 02 May 2024 12:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు రాజమౌళి (SS Rajamouli), స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ (NTR) కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలిచి కోట్లు వసూళ్లు చేశాయి. ‘స్టూడెంట్‌ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘ఆర్ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాలు ఎన్టీఆర్‌ కెరీర్‌ను మలుపుతిప్పాయి. అంతేకాదు ఈ దర్శకధీరుడి డైరెక్షన్‌లో అత్యధిక సినిమాలు చేసిన హీరో కూడా తారక్‌ కావడం విశేషం. సినిమాల విషయం పక్కనపెడితే సందర్భం వచ్చిన ప్రతిసారి వీళ్లిద్దరూ వారి స్నేహం గురించి చెబుతుంటారు. తాజాగా ‘కృష్ణమ్మ’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రాజమౌళి హాజరయ్యారు. ఎన్టీఆర్‌పై ఆసక్తికర కామెంట్ చేశారు.

పరిశ్రమలో మీకున్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరని యాంకర్‌ ప్రశ్నించగా.. ఆడియన్స్‌ అందరూ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. దానికి రాజమౌళి సమాధానం చెబుతూ.. ‘ఇండస్ట్రీలో నాకు ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. ‘బాహుబలి’, ‘ఈగ’ నిర్మాతలు సాయి కొర్రపాటి, శోభు యార్లగడ్డ నాకు మంచి స్నేహితులు. ఎన్టీఆర్‌ నాకు తమ్ముడితో సమానం. మిత్రుడు కాదు. నా మొదటి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ అవకాశం రావడానికి రచయిత పృథ్వీతేజ కారణం’ అని చెప్పారు. ఇక ఇదే ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. విజయవాడ అనగానే తనకు కనకదుర్గ గుడి గుర్తుకు వస్తుందన్నారు. తన స్కూల్‌ ఫ్రెండ్స్‌ అందరూ గోదావరి జిల్లావాళ్లని భోజనం ఎక్కువగా పెడతారంటూ సరదాగా అన్నారు. తనకు అన్నిరకాల స్వీట్స్‌ అంటే ఇష్టమని తెలిపారు.

 ‘కృష్ణమ్మ’ సినిమా మంచి విజయం సాధించాలని రాజమౌళి కోరుకున్నారు. ‘‘కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారని తెలియగానే నా దృష్టి దీనిపై పడింది. దర్శకుడి మాటల్లోని నిజాయతీ ఈ సినిమాలోనూ ఉంటుందని నమ్ముతున్నా. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లు సినిమా చూడాలనిపించేలా ఉన్నాయి. సత్యదేవ్‌ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్‌డమ్‌ వస్తుంది. అది ఈ ‘కృష్ణమ్మ’ చిత్రంతో సాధ్యమవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. సత్యదేవ్‌ హీరోగా వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని