Bun Tikki: షబానా ఆజ్మీ.. జీనత్‌ అమన్‌ల చిత్రం బన్‌ టిక్కీ

బాలీవుడ్‌ సీనియర్‌ కథానాయికలు షబానా ఆజ్మీ, జీనత్‌ అమన్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బన్‌ టిక్కీ’. అభయ్‌ దేవోల్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఫరాజ్‌ అరిఫ్‌ అన్సారీ తెరకెక్కిస్తున్నారు.

Updated : 21 Nov 2023 09:38 IST
బాలీవుడ్‌ సీనియర్‌ కథానాయికలు షబానా ఆజ్మీ, జీనత్‌ అమన్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బన్‌ టిక్కీ’. అభయ్‌ దేవోల్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఫరాజ్‌ అరిఫ్‌ అన్సారీ తెరకెక్కిస్తున్నారు. సొంత నిర్మాణ సంస్థ..స్టేజ్‌ 5 ప్రొడక్షన్‌ బ్యానర్‌పై జీ స్టూడియోస్‌తో కలిసి ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌, నిర్మాత మనీష్‌ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజాగా ప్రారంభమైంది. ఆ విషయాన్ని మనీష్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. ‘సున్నితమైన, భావోద్వేగపు కథలతో సినిమాలు తీయాలనేది నా కల. ఆ కల, ప్రేమతోనే స్టేజ్‌ 5 ప్రొడక్షన్‌ పతాకంపై రెండో చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ‘బన్‌ టిక్కీ’ని సిమ్లాలో స్వామివారి ఆశీసులతో మొదలుపెట్టాము’ అంటూ వ్యాఖ్యల్ని జోడించారు. సెప్టెంబరులో ప్రారంభించిన తన సొంత బ్యానర్‌పై మనీష్‌ నిర్మించిన తొలి చిత్రం ‘ట్రేన్‌ ఫ్రమ్‌ ఛపరౌలా’. రాధికా ఆప్టే, దివ్యేందు, ఖుషా కపిలా తదితరులు నటించిన ఆ సినిమాని టిస్కా చోప్రా తెరకెక్కించారు.

గూఢచారి కోసం బనిత

‘అక్టోబర్‌’, ‘సర్దార్‌ ఉధమ్‌’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాయిక బనితా సంధు.. ఇప్పుడు టాలీవుడ్‌లో సందడి చేయడానికి ముస్తాబవుతోంది. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జీ2’. వినయ్‌ కుమార్‌ సిరిగినీడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా బనితా సంధు నటించనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్భంగా బనిత మాట్లాడుతూ.. ‘ఇది నా మొదటి పాన్‌-ఇండియా చిత్రం. ఇలాంటి అద్భుతమైన చిత్రబృందంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నేను మునుపెన్నడూ చేయని భిన్నమైన పాత్ర ఇది. ఈ సినిమాలో ప్రేక్షకులు నన్ను కొత్త అవతారంలో చూడబోతున్నార’ని చెప్పుకొచ్చింది. బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న ‘గూఢచారి’ చిత్రానికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రమిది. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ని టీజీ.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని