Sidharth Shukla: సిద్ధార్థ్‌ మృతి.. ఆ రాత్రి అసలేం జరిగింది?

Sidharth Shukla: సిద్ధార్థ్‌ తెల్లవారుజామున నిద్రలేచి గుండెల్లో నొప్పిగా ఉందని తన తల్లికి చెప్పారు. ఆ తర్వాత...

Updated : 03 Sep 2021 12:01 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు, ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌-13’ సీజన్‌ విజేత సిద్దార్థ్‌ శుక్లా (40) గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.  వెంటనే స్పందించి కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. సిద్ధార్థ్‌ ఆకస్మిక మరణంతో బాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. నిద్రపోయే ముందు సిద్ధార్థ్‌ ఏదో  మెడిసన్‌ తీసుకున్నారని, ఉదయం నిద్రలేవలేదని వార్తలు వచ్చాయి. అసలు సిద్ధార్థ్‌ చనిపోయే ముందు రోజు రాత్రి ఏం జరిగింది? పోలీసులు, వైద్యుల తెలిపిన వివరాల ప్రకారం కొంతం సమాచారం  బయటకు వచ్చింది. అదేంటంటే..?

సిద్ధార్థ్‌కు తెల్లవారుజామున 3-3.30గంటల సమయంలో మెలకువ వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారు. గుండెల్లో నొప్పిగా ఉందని తన తల్లికి చెప్పడంతో, ఆమె మంచినీళ్లు ఇస్తే తాగి పడుకున్నారు. ఆ తర్వాత మళ్లీ నిద్రలేవలేదు. సిద్ధార్థ్‌ తల్లి నిద్రలేపేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. వెంటనే ఆమె తన కుమార్తెకు ఫోన్‌ చేశారు. ఆమె వచ్చి, సిద్ధార్థ్‌ పరిస్థితి చూసి ఆస్పత్రికి తరలించారట.

సిద్ధార్థ్‌ శరీరంపై ఎలాంటి గాయాలు గుర్తించలేదని పోలీసులు తెలిపారు. సిద్ధార్థ్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతోంది. ఇద్దరు పోలీస్‌ అధికారులు కూడా పోస్ట్‌మార్టంను పరిశీలిస్తున్నారు. అంతేకాదు, పోస్ట్‌మార్టంను చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది. మరోవైపు సిద్ధార్థ్‌ కుటుంబం కూడా ఇప్పటివరకూ ఆయన మృతిపై ఎలాంటి అనుమానాలు లేవనెత్తలేదు.

వైద్యులు ఏమన్నారంటే..

సిద్ధార్థ్‌ను ఉదయం 10.30గంటల సమయంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ నిరంజన్‌, సిద్ధార్థ్‌ను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలను గుర్తించలేదని వివరించారు.

ఆ ట్వీట్‌ వైరల్‌

మరోవైపు గతంలో సిద్ధార్థ్‌ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ‘‘ఇతరులు నీ గురించి ఏ మాట్లాడుకుంటున్నారు.. ఏ ఆలోచిస్తున్నారని విచారించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఆనందంగా ఉండండి. వాళ్లు  అలాగే మాట్లాడుకునేందుకు ఏదొకటి ఇవ్వండి’’ అని ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని