Operation Lotus: కర్ణాటకలో ‘ఆపరేషన్‌ కమలాని’కి యత్నాలు..! సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘ఆపరేషన్‌ కమలం’ నిర్వహించేందుకు భాజపా యత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.

Published : 28 Oct 2023 16:55 IST

బెంగళూరు: కర్ణాటకలో ‘ఆపరేషన్‌ కమలం (Operation Kamala)’ ఊహాగానాలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్‌ (Congress) ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకుగానూ ‘ఆపరేషన్‌ కమలం’ నిర్వహించేందుకు భాజపా (BJP) యత్నిస్తున్నట్లు సమాచారం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆరోపించారు. అయితే.. వారి ప్రయత్నాలు ఫలించవని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ ఈ ఉచ్చులో పడరని పేర్కొన్నారు.

కర్ణాటకలో 2019లో కాంగ్రెస్‌- జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేందుకు కారణమైన ఓ వర్గం.. ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు యత్నిస్తోందని మాండ్య కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవికుమార్‌ గౌడ ఇటీవల ఆరోపించారు. రూ.50 కోట్లు, మంత్రి పదవి వంటివి ఆశ చూపుతున్నారని, ఇప్పటికే నలుగురిని సంప్రదించినట్లు తెలిపారు. జేడీ(ఎస్)లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన, యాడియూరప్ప మాజీ వ్యక్తిగత సహాయకుడు ఆ వర్గంలో సభ్యుడని కూడా ఆరోపించారు. ఇందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని చెప్పారు.

‘కర్ణాటకను ‘బసవనాడు’గా మారిస్తే తప్పేంటి?’

రవికుమార్‌ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘ఈ విషయం గురించి నాకు తెలియదు. రవితో మాట్లాడలేదు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ‘ఆపరేషన్‌ కమలం’ నిర్వహించేందుకు భాజపా యత్నిస్తున్నట్లు నాకు కూడా సమాచారం ఉంది’ అని తెలిపారు. అయితే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ ఎక్కడికి వెళ్లరని, కాషాయ పార్టీ ఎప్పటికీ విజయం సాధించదన్నారు.

అంతకుముందు గౌడ వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ‘పెద్ద కుట్ర జరుగుతోంది. కానీ అది ఫలించదు. అందరి వ్యవహారశైలి మాకు తెలుసు. రవికుమార్‌ ఓ యువకుడి పేరు తీసుకున్నారు. కానీ, పెద్దవారే ఇదంతా చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు భాజపాలో ఒక టీమ్ యాక్టివ్‌గా ఉందని ఇటీవల డీకేఎస్‌ స్వయంగా ఆరోపించారు. తనతోపాటు సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్ని విషయాలు తెలియజేశారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని