Congress: శతాధిక పార్టీకి నిధుల కొరత.. 2024 ఎన్నికల కోసం క్రౌడ్‌ ఫండింగ్‌..!

దాదాపు పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్‌(Congress).. నిధుల కొరతతో ఇబ్బందిపడుతోందని సమాచారం. దాంతో సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గరపడుతున్న తరుణంలో నిధుల సేకరణకు కొత్తమార్గాల్లో వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Published : 30 Oct 2023 13:26 IST

దిల్లీ: కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన శతాధిక పార్టీ కాంగ్రెస్‌(Congress) నిధుల కొరతను ఎదుర్కొంటోంది. కొద్దినెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరం కోసం నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. అందు కోసం కాంగ్రెస్‌ త్వరలో క్రౌడ్‌ ఫండింగ్‌(Crowdfunding)కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్‌(ఏడీఆర్) ప్రస్తుత గణాంకాల ప్రకారం.. కాంగ్రెస్(Congress) నిధుల విలువ రూ.805.68 కోట్లుగా ఉంది. మరోపక్క భాజపా(BJP)నిధుల విలువ భారీస్థాయిలో రూ 6,046.81 కోట్లుగా ఉంది. గత ఏడు సంవత్సరాల్లో హస్తం పార్టీకి అందుతోన్న విరాళాలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో భాజపాకు ప్రకటించిన కార్పొరేట్ విరాళాల మొత్తం.. అన్ని జాతీయ పార్టీలకు అందిన విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువ. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం 18 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

మిత్రభేదాల ‘మధ్య’ కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవా?

ఇక ఆన్‌లైన్‌ విరాళాల సేకరణ విషయంలో కాంగ్రెస్‌.. ఆమ్‌ ఆద్మీ పార్టీ బాటలో వెళ్లాలనుకుంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కూడా నిధుల కొరత ఎదురుకావడంతో ఈ దారినే అనుసరించింది. ఆ ఎన్నికల్లో 545 లోక్‌సభ సీట్లకు గానూ 52 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా 303 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు నవంబర్‌లో ఎన్నికలు జరగనుండగా..డిసెంబర్‌ మూడున ఫలితాలు వెల్లడికానున్నాయి. వీటి తర్వాత కాంగ్రెస్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని