Nara Lokesh: ఆక్వా రైతుకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్తు

‘సీఎం జగన్‌ ఆక్వా రైతులకు హామీలిచ్చి వారి గొంతుకోశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని ఆదుకుంటాం. జోన్లతో సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే అందిస్తాం.

Updated : 04 Sep 2023 06:39 IST

జోన్లతో ప్రమేయం లేకుండా సాయం చేస్తాం
యువగళం పాదయాత్ర సభలో నారా లోకేశ్‌

ఈనాడు, ఏలూరు: ‘సీఎం జగన్‌ ఆక్వా రైతులకు హామీలిచ్చి వారి గొంతుకోశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని ఆదుకుంటాం. జోన్లతో సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే అందిస్తాం. పనిముట్లు, యంత్రాలు రాయితీపై ఇస్తాం. మీ పెట్టుబడి తగ్గించి ఆదాయం పెరిగేలా పాలసీలు తీసుకొస్తాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. యువగళం 203వ రోజు పాదయాత్రలో భాగంగా ఆదివారం ఏలూరు జిల్లా నిడమర్రు, పశ్చిమగోదావరి జిల్లా గణపవరం, ఉండి మండలాల్లో ఆయన పర్యటించారు. గణపవరం శేష మహల్‌ థియేటర్‌ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని పడుకోబెట్టారు. చింతలపూడిని చంపేశారు. ఆయిల్‌పామ్‌ రైతులను ముంచేశారు. వరి రైతులను గాలికొదిలేశారు. ఉమ్మడి పశ్చిమలో అన్ని స్థానాల్లో తెదేపాను గెలిపించండి.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం. పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టించి.. యువతకు ఉపాధి కల్పిస్తాం’ అని లోకేశ్‌ భరోసా ఇచ్చారు.

అయిదుగురు మంత్రులున్నా ప్రయోజనం ఏదీ?

‘వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి అయిదుగురు మంత్రులయ్యారు. ఇంతమంది మంత్రులుంటే అభివృద్ధి శరవేగంగా జరగాలి. కానీ ఇక్కడ సైకో జగన్‌ గుంతల పథకం మాత్రమే అమలవుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ల నాని సొంత ఊరిలో ప్రజారోగ్యం కాపాడలేదు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా రంగనాథరాజు ఒక్క ఇల్లూ కట్టలేదు. ధాన్యం మొలకలొస్తున్నాయని రైతులడిగితే ఎర్రిపప్పా అని తిట్టే గొప్ప మంత్రి పౌరసరఫరాల శాఖ చూస్తున్నారు. హోంమంత్రిగా తానేటి వనిత ఇంటికే పరిమితమయ్యారు. మరో మంత్రి కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖను కొట్టేయడంలో సిద్ధహస్తుడు’ అని లోకేశ్‌ విమర్శించారు. ‘ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు మట్టి, గ్రావెల్‌ అక్రమాలకు పాల్పడుతున్నారు’ అని ఆరోపించారు. ‘జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగులకు ఆర్థిక సాయం అంటూ జగన్‌ యువతను మోసం చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తాం. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం అందిస్తాం’ అని లోకేశ్‌ హామీలిచ్చారు. నిడమర్రు మండలం పత్తేపురం-నిడమర్రు రహదారి అధ్వాన స్థితిపై లోకేశ్‌ స్వీయచిత్రం తీసుకుని నిరసన తెలిపారు.


ఫ్లెక్సీలు ఊపుతూ.. రాళ్లు రువ్విన వైకాపా శ్రేణులు

యువగళం యాత్ర నిడమర్రు చేరుకోగా, అదే గ్రామానికి చెందిన ఓ వైకాపా కార్యకర్త ద్విచక్ర వాహనం అడ్డుపెట్టి వెళ్లేందుకు వీలు లేదంటూ అడ్డగించడంతో స్వల్ప వివాదం జరిగింది. పోలీసులు రావడంతో ముందుకు సాగారు. పాదయాత్ర మందలపర్రు చేరుకునే సమయానికి అదే వ్యక్తి మరికొందరు వైకాపా కార్యకర్తలను తీసుకొచ్చి ఆ పార్టీ ఫ్లెక్సీలు ఊపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో వైకాపా కార్యకర్తలను యువగళం వాలంటీర్లు ప్రతిఘటించారు. వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రెడ్డి చందు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగింది.


వైకాపా ఫ్లెక్సీలను సరిచేసిన పోలీసులు

అధికార పార్టీ పట్ల పోలీసుల అత్యుత్సాహం మరోసారి బయటపడింది. స్వయంగా పోలీసులే వైకాపా ఫ్లెక్సీలు కట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2 రోజుల కిందట గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా వైకాపా నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆదివారం యువగళం యాత్ర నేపథ్యంలో తెదేపా కార్యకర్తలు సైతం ఫ్లెక్సీలు కట్టారు. వైకాపా ఫ్లెక్సీలు కిందకు జారిపోవడంతో ఆదివారం పోలీసులే వాటిని సరిచేసి కట్టారు. స్వయాన నిడమర్రు ఎస్సై అక్కడే ఉండి ఫ్లెక్సీలు కట్టించడం గమనార్హం. దీనిపై ఎస్సై మాట్లాడుతూ వివాదాలు జరగకుండా ఫ్లెక్సీలు సరిచేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని