Telangana Congress: ముఖ్య నేతల చేరికలు ఖరారు!

హైదరాబాద్‌లో ఈ నెల 17న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Updated : 08 Sep 2023 09:39 IST

17న మైనంపల్లి, తుమ్మలకు కాంగ్రెస్‌ తీర్థం
వారితోపాటు మరికొందరు వచ్చే అవకాశం
కోమటిరెడ్డిని బుజ్జగించిన కేసీ వేణుగోపాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఈ నెల 17న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా భారాసకు చెందిన ఒక ఎమ్మెల్యే, మరో మాజీ మంత్రి సహా పలువురిని బహిరంగ సభ వేదికగా పార్టీలో చేర్చుకోనున్నట్లు తెలిసింది. బుధవారం హైదరాబాద్‌లో పర్యటించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌ల చేరిక ఖరారైనట్లు సమాచారం. మైనంపల్లితో మొదట పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చించారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్‌ వద్ద తుది నిర్ణయం జరిగినట్లు తెలిసింది. వారికి మల్కాజిగిరి, మెదక్‌ అసెంబ్లీ స్థానాలను కేటాయించడానికి కాంగ్రెస్‌ అంగీకరించినట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ నాయకులు చర్చిస్తున్న విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి... తుమ్మలను ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత ఖమ్మంలో పొంగులేటి, భట్టి విక్రమార్కలు సైతం ఆయన్ని కలిశారు. ఈ చర్చలకు కొనసాగింపుగా కేసీ వేణుగోపాల్‌ మాట్లాడినట్లు తెలిసింది. అయితే తుమ్మల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఏదో ఒకచోటు నుంచే పోటీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కూకట్‌పల్లి నుంచి కూడా తుమ్మల పేరును కొందరు సూచించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు మాత్రం ఖమ్మం జిల్లా నుంచే ఆయనను పోటీలో దించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

పది రోజుల్లో కోమటిరెడ్డికి సముచిత స్థానం!

పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తిగా ఉన్న భువనగిరి ఎంపీ, పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అధిష్ఠానం బుజ్జగించింది. పది రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, సంపత్‌కుమార్‌లు గురువారం తెల్లవారుజామున ఆయన్ని తాజ్‌ కృష్ణాలో బసచేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కొంతసేపు మాట్లాడాక వేణుగోపాల్‌, కోమటిరెడ్డిలు ఒకే కారులో శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లారు. దారిలో వెంకట్‌రెడ్డి తన ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీని, సీనియర్‌నైన తనకు రాష్ట్ర ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీలో, ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీలో, సీడబ్ల్యూసీలోనూ స్థానం కల్పించకపోవడాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. తనకంటే జూనియర్‌లు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారికి అవకాశమిచ్చారని వాపోయినట్లు సమాచారం. కొందరికి కీలకమైన రెండేసి స్థానాల్లో చోటు కల్పించడాన్నీ ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి కేసీ వేణుగోపాల్‌ స్పందిస్తూ... ‘‘మీ ఆవేదన అర్థం చేసుకోగలను. ఉద్దేశపూర్వకంగా ఎవరినీ పక్కనపెట్టడం జరగదు. తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తాం’’ అని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిసింది. వెంకట్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు రావడంతో బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, భట్టివిక్రమార్క, సంపత్‌కుమార్‌లు ఆయన నివాసానికి వెళ్లి సముదాయించిన విషయం తెలిసిందే. కేసీ వేణుగోపాల్‌తో అప్పుడే వారు ఫోన్‌లో మాట్లాడించగా... హైదరాబాద్‌ వస్తున్నానని, కలుద్దామని చెప్పి, అనుకున్నట్లుగానే కలిశారు. కేసీ హామీతో కోమటిరెడ్డి కుదుటపడ్డారా, లేదా అనేది తెలియాల్సి ఉంది. 

యెన్నం శ్రీనివాసరెడ్డి సైతం...!

మహబూబ్‌నగర్‌ నుంచి గతంలో భాజపా నుంచి గెలుపొందిన యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా ఈ నెల 17నే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. కొంతకాలంగా ఈయన కాంగ్రెస్‌ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవలే ఆయన్ని సస్పెండ్‌ చేస్తూ భాజపా నిర్ణయం తీసుకొంది. వీరితోపాటు మరికొందరితోనూ కాంగ్రెస్‌ నేతలు చర్చిస్తున్నట్లు తెలిసింది. అయితే... చేరికల వల్ల ఆయా నియోజకవర్గాల్లో విజయావకాశాలు మెరుగుపడాలే తప్ప కొత్తగా సమస్యలు వచ్చేలా ఉండకూడదని, అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినందున, ఈ సభలోనే ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల చేరికలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని