21న తెదేపా అభ్యర్థులకు బి-ఫాంలు

తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు స్వయంగా బి-ఫాంలు అందజేయనున్నారు.

Published : 19 Apr 2024 05:47 IST

అందజేయనున్న పార్టీ అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు స్వయంగా బి-ఫాంలు అందజేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం లేదా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో 144 శాసనసభ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థులకు చంద్రబాబు బి-ఫాంలు అందజేస్తారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరు, మిత్రపక్షాలతో క్షేత్రస్థాయిలో సమన్వయం ఎలా ఉంది? వంటి అంశాలపై ఆయన వారితో సమీక్షిస్తారు. ఎన్నికల ప్రచారం జరగాల్సిన తీరు వంటి అంశాలపై వారికి దిశానిర్దేశం చేస్తారు. ఒకే వేదికపై మొత్తం పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు చేతుల మీదుగా బి-ఫాంలు ఇవ్వడం ఎప్పుడూ లేదు. గతంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగేది. బి-ఫాంలను జిల్లాలకు పంపిస్తే, అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షులు లేదా, సీనియర్‌ నాయకులు వారికి అందజేసేవారు. దానికి భిన్నంగా ఈసారి పొత్తులో భాగంగా తెదేపాతో పాటు, జనసేన, భాజపా పోటీ చేసే స్థానాలకూ అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించడం, నామినేషన్ల ప్రక్రియ ముగియడానికి ఇంకా గడువుండటంతో.. స్వయంగా చంద్రబాబు చేతుల మీదుగా బి-ఫాంలు ఇవ్వాలని నిర్ణయించారు. రెండు మూడు చోట్ల అభ్యర్థుల మార్పుపై చంద్రబాబు ఈ నెల 21లోగా కసరత్తు పూర్తి చేస్తారని సమాచారం.

నామినేషన్‌ పత్రాలపై సంతకం: కుప్పం నుంచి పోటీ చేయనున్న చంద్రబాబు నామినేషన్‌ పత్రాలపై గురువారం సంతకం చేశారు. ఆయన తరఫున సతీమణి భువనేశ్వరి శుక్రవారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తారు. చంద్రబాబు గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ జోనల్‌ ఇన్‌ఛార్జులతో సమావేశమయ్యారు. వారి పరిధిలోని జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై కూలంకషంగా సమీక్షించారు. వివిధ కారణాల వల్ల టికెట్‌లు దక్కని నాయకుల పరిస్థితేంటి? వారితో సమన్వయం చేసుకుంటున్నారా? జనసేన, భాజపా శ్రేణులతో క్షేత్రస్థాయిలో సమన్వయం ఎలా ఉంది? వంటి అంశాలను ఆయన తెలుసుకున్నారు. చంద్రబాబుతో సమావేశమైనవారిలో దామచర్ల సత్య, సుజయకృష్ణ రంగారావు, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాస్‌రెడ్డి, మంతెన సత్యనారాయణరాజు, బీద రవిచంద్రయాదవ్‌, బొబ్బిలి చిరంజీవి, యనమదల రవి, దీపక్‌రెడ్డి, కోవెలమూడి రవీంద్ర (నాని) ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని