నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు

నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు.

Updated : 28 Apr 2024 06:46 IST

బకాయిలు తీరుస్తాం.. పని కల్పిస్తాం
మంత్రి పొన్నం ప్రభాకర్‌
బాధిత కుటుంబాలకు పరామర్శ

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల; తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌, సిరిసిల్ల పట్టణంలో ఇటీవల నేతన్నలు ఆత్మహత్య చేసుకోగా శనివారం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ చౌధరి, విప్‌ ఆది శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. 2009-14 కాలంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ ఆత్మహత్యలు వద్దు, బతకడం ముద్దు అంటూ సిరిసిల్లలో ర్యాలీ తీసి నేతన్నలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశామని గుర్తు చేశారు. ‘ఈ రోజు శవరాజకీయాలు చేసే వారికి చెబుతున్నా. రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చు. ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీరు పెట్టిన బకాయిలు తీర్చే పనిలో ఉంది. నేత కార్మికులకు చేతినిండా పని ఇచ్చే బాధ్యత మాది’ అని అన్నారు. ప్రభుత్వం జీవో నంబరు 1ని తీసుకొచ్చిందని, అందులో ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించే మొత్తం వస్త్రోత్పత్తుల ఆర్డర్లను తెలంగాణలోని అందరు నేతన్నలకు ఇస్తామన్నారు.

మిగతా ప్రాంతాలతో పోల్చితే సిరిసిల్లలో ఎక్కువ వస్త్రోత్పత్తి జరుగుతుంది కాబట్టి ఇక్కడికే ఎక్కువ మీటర్ల ఆర్డర్లు వస్తాయని చెప్పారు. కోడ్‌ దృష్ట్యా ఆలస్యమవుతోందన్నారు. నేత కార్మికుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రితోపాటు మంత్రివర్గం సానుకూలంగా ఉందని తెలిపారు. సిరిసిల్ల వస్త్రోత్పత్తుల విక్రయాల కోసం ముఖ్యమంత్రిని ఒప్పించి హైదరాబాద్‌లో మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాధితుల కుటుంబాల్ని పరామర్శించినపుడు ఇల్లు లేదు, పింఛను రావడం లేదని చెబుతున్నారని, దీనికి పదేళ్లు అధికారంలో ఉన్నవారే బాధ్యులని అన్నారు. కొందరు నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన తమపై నెపం నెడుతున్నారని విమర్శించారు. గతంలో సిరిసిల్లలో 12 వేల అంత్యోదయ కార్డులు ఉండేవని, వాటిని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. అవి ఉంటే ఈ రోజు నేతన్నలకు తినేందుకు 35 కిలోల బియ్యం వచ్చేవన్నారు. ‘‘నేతన్నలారా.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండు చేతులు జోడించి చెబుతున్నా. మీకు ఏదైనా సమస్య ఉంటే అధికారులకు లేదా మా దృష్టికి తీసుకురండి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు చేసుకోకండి’’ అని కోరారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్నవారే తమపై ఆరోపణలు చేస్తున్నారని, వారు చేసిన తప్పులకు, అప్పులకు పొలిమేర దాటే వరకు కొట్టాలని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని