Kapil Sibal : నియంతృత్వ పాలన సాగించడానికే కొత్త చట్టాల రూపకల్పన : కపిల్ సిబల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న కొత్త బిల్లులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్‌ సిబల్‌ (Kapil Sibal) వ్యాఖ్యానించారు. ఆ బిల్లులను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Published : 13 Aug 2023 20:04 IST

దిల్లీ : దేశంలో నియంతృత్వ పాలన సాగించడానికే కేంద్ర ప్రభుత్వం నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమైందని మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌ (Kapil Sibal) విమర్శించారు. కొత్త బిల్లు ‘భారతీయ న్యాయ సంహిత’  (Bharatiya Nyaya Sanhita) రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. వలసవాద చట్టాలను తొలగిస్తున్నామని చెబుతూ నియంతృత్వ పోకడలను ఎన్డీయే ప్రభుత్వం తీసుకురాబోతోందని ఆరోపించారు. కొత్త చట్టాలు వాస్తవ రూపం దాల్చితే దేశ భవిష్యత్తు నాశనమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

హైదరాబాద్‌లో ఎకరం రూ.100 కోట్లకు కులం పెంచిందా?: లోకేశ్‌

సిబల్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ న్యాయ సంహిత బిల్లు చాలా ప్రమాదకరమైనదని ఆక్షేపించారు. అది న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు విరుద్ధమని చెప్పారు. ‘వారు (ఎన్డీయే ప్రభుత్వం) వలసవాద చట్టాలకు ముగింపు పలుకుతున్నామని చెబుతున్నారు. కానీ, చట్టాల ద్వారా దేశంలో నియంతృత్వం తీసుకురావాలనేది వారి ఆలోచన. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మెజిస్ట్రేట్లు, కాగ్‌, ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకునే చట్టాలను రూపొందించాలనుకుంటున్నారు. న్యాయమూర్తులు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నా. ఇలాంటి చట్టాలు అమల్లోకి వస్తే దేశ భవిష్యత్తు నాశనమవుతుంది. వీటిని (బిల్లులు) వెనక్కి తీసుకోవాలని మిమ్మల్ని (ప్రభుత్వాన్ని) అభ్యర్థిస్తున్నా. లేకుంటే మీరు ఎలాంటి ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారో దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలకు వివరిస్తామని’ సిబల్‌ వ్యాఖ్యానించారు. 

రెండ్రోజుల క్రితం భారత శిక్షాస్మృతి (IPC), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (CrPC), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ల (Indian Evidence Act)ను కొత్త చట్టాలతో భర్తీ చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) వెల్లడించారు. ఇందుకు సంబంధించి మూడు బిల్లులను లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత- 2023 (Bharatiya Nyaya Sanhita), భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత- 2023 (Bharatiya Nagarik Suraksha Sanhita), భారతీయ సాక్ష్య బిల్లు- 2023 (Bharatiya Sakshya Bill)లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని చెప్పారు. వీటిలో మొత్తంగా 313 మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. పాత చట్టాలు ఆంగ్లేయుల పాలనను రక్షించడం, బలోపేతం చేయడంతోపాటు శిక్షించడమే లక్ష్యంగా వాటిని ప్రవేశపెట్టారని షా తెలిపారు. శిక్ష వేయడం కాకుండా.. న్యాయం అందించడమే కొత్త చట్టాల లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని