Nara Lokesh: ప్రజల ఆగ్రహంలో జగన్‌ కొట్టుకుపోతారు: లోకేశ్‌

ఇసుక దందాలో సీఎం జగన్‌ రోజుకు రూ.3కోట్లు చొప్పున అక్రమంగా సంపాదిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు.

Updated : 22 Aug 2023 20:18 IST

గన్నవరం: ఇసుక దందాలో సీఎం జగన్‌ రోజుకు రూ.3కోట్లు చొప్పున అక్రమంగా సంపాదిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్‌ ప్రసంగించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, సిమెంట్‌, ఐరన్‌ ఛార్జీలు తగ్గించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యమాల వాడ బెజవాడ.. ప్రజల ఆగ్రహంలో జగన్‌ కొట్టుకుపోతారన్నారు. యువగళం చూసి జగన్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. యువగళానికి వచ్చిన స్పందన చూసి జగన్‌కు భయం పట్టుకుందన్నారు. పవిత్రమైన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.

జగన్‌ పరిపాలనలో పవర్‌ హాలిడే, క్రాప్‌ హాలిడే, ఆక్వా హాలిడే అని ఎద్దేవా చేశారు. కృష్ణాజిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. తెదేపా నేతలు, కార్యకర్తలను వేధించిన ఎవరినీ  వదలనని హెచ్చరించారు. చట్టాలు ఉల్లంఘించిన అధికారులపై న్యాయ విచారణ జరిపించి జైళ్లకు పంపిస్తామన్నారు. గన్నవరంలో ఉన్నా.. విదేశాలకు పారిపోయినా ఎవరినీ వదలనని స్పష్టం చేశారు. కంచుకోట గన్నవరంలో మరోసారి తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసిన తాను.. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని వీడబోనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ అసభ్య పదజాలంతో తెలుగుదేశం నాయకులను దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా సాగిన లోకేశ్‌ పాదయాత్ర జైత్రయాత్రను తలపించిందన్నారు.

యువగళం పాదయాత్ర 191వ రోజుకు చేరడంతో గన్నవరం సభకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.  గన్నవరంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, మారిన సమీకరణాలతో బలనిరూపణకు గన్నవరం సభ వేదికగా మారింది. మరో వైపు యార్లగడ్డ వెంకట్రావ్‌ రాక తెదేపా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. మాజీ మంత్రులు దేవినేని ఉమా, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, మండలి బుద్ధప్రసాద్‌తో పాటు పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని