Nitish Kumar: జేడీ(యూ)లో అంతా బాగానే ఉంది.. ఆ రూమర్లను కొట్టిపారేసిన సీఎం నీతీశ్

జేడీయూలో కలహాలు ఉన్నట్లు వస్తోన్న రూమర్లపై జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ స్పందించారు.

Updated : 25 Dec 2023 16:54 IST

పట్నా: తమ పార్టీలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను జేడీ(యూ) అధినేత, బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ (Nitish kumar) కొట్టిపారేశారు. పార్టీలో అంతా బాగానే ఉందని.. నేతలందరం ఐక్యంగానే ఉంటున్నారని తెలిపారు.  ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుచేసేందుకు తమ పార్టీ శ్రేణులన్నీ కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. సోమవారం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ 99వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నీతీశ్.. మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత వారంలో  ఇండియా కూటమి సమావేశంలో జరిగిన చర్చలపై అసంతృప్తిగా ఉన్నట్లు వచ్చిన వార్తల్ని నీతీశ్‌ ఖండించారు. తనకు ఎలాంటి కోరిక లేదని మొదట్నుంచి చెబుతున్నానన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను ఏక తాటిపైకి తీసుకురావాలనేదే తన ఏకైక కోరిక అని.. ఆ దిశగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందని నీతీశ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 

భాజపా నేతల మాటల్ని పట్టించుకోను

జేడీయూలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఒకవర్గం మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. ‘మా  పార్టీలో అంతా ఐక్యంగా ఉన్నాం. అంతా సజావుగానే ఉంది. మా గురించి భాజపా నేతలు చెప్పే మాటల్ని నేను పట్టించుకోను. వాళ్లు ఏదైనా అనుకోవచ్చు. దానికి విలువ లేదు.  మా దృష్టంతా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపైనే ఉంది. బిహార్‌ను అభివృద్ధి చేసేందుకు అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. బిహార్‌ యువతకు 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాం. ఆ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని స్పష్టంగా చెబుతున్నా.  మహాగట్‌బంధన్‌ ప్రభుత్వం ద్వారా ఇప్పటికే దాదాపు ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం.’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని