No-Confidence Motion: మణిపుర్‌కు మోదీ ఎందుకెళ్లట్లేదు..? అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రశ్నలు

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం (No-Confidence Debate)పై చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు దీనిలో భాగమయ్యారు. 

Updated : 08 Aug 2023 14:56 IST

దిల్లీ: పార్లమెంట్‌లో మాట్లాడకుండా ఉండేందుకు ప్రధాని మోదీ మౌనవత్రం పట్టారని, ఆయన్ను మాట్లాడించేందుకే తాము అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Debate)పై మంగళవారం చర్చ ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఆయన ఈ మాట అన్నారు. అలాగే మూడు ప్రశ్నలను సంధించారు.

1. ఇప్పటివరకు ప్రధాని మోదీ ఎందుకు మణిపుర్‌లో పర్యటించలేదు. 

2. మణిపుర్‌పై మాట్లాడేందుకు 80 రోజుల సమయం ఎందుకు పట్టింది..? అప్పుడు కూడా కేవలం 30 సెకన్లు మాత్రమే మాట్లాడతారా..?

3. ఎందుకు ఇప్పటివరకు మణిపుర్ సీఎంను తొలగించలేదు..?  అని ప్రశ్నించారు.

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur)లో జాతుల మధ్య వైరం జరుగుతోంది. దానిపై ప్రకటన చేసేందుకు మోదీ పార్లమెంట్‌కు రావాలని గత కొద్దిరోజులుగా విపక్షాలు పట్టుబడుతున్నాయి. దాంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. దీనిపై హోం మంత్రి అమిత్‌ షా బదులిస్తారని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ కీలక అంశంపై ప్రధానే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని ఉపయోగించాయి. 

ఈ చర్చలో భాగంగా గొగొయ్ మాట్లాడుతూ.. ‘మేం అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చేలా పరిస్థితులు ఎదురయ్యాయి. ఇది లోక్‌సభలో ఉన్న సంఖ్యాబలం గురించి తెలుసుకోవడానికి తెచ్చింది కాదు. మేం ఈ తీర్మానం నెగ్గుతామన్న నమ్మకం కూడా లేదు. కానీ, మణిపుర్‌కు న్యాయం జరగాలనే ఉద్దేశంతో తీసుకువచ్చింది’ అని అన్నారు.

‘చివరి బంతికి సిక్స్‌ కొట్టండి’.. అవిశ్వాసం వేళ ఎంపీలకు మోదీ సూచన

రాహుల్‌ మాట్లాడకపోవడంపై ఘర్షణ..

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్‌సభ సమావేశాలు.. గంట పాటు వాయిదాపడ్డాయి. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం కాగా.. కాంగ్రెస్ ఎంపీ గొరవ్‌ గొగొయ్‌ అవిశ్వాసంపై చర్చను ప్రారంభించారు. మొదట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. దాంతో సభ ప్రారంభమైన వెంటనే తీవ్ర ఘర్షణ జరిగింది. ‘రాహుల్‌ చర్చ ప్రారంభిస్తారనుకున్నాం. చివరి 5 నిమిషాల్లో ఏమైంది’ అని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. ఈ సమయంలో ఎంపీల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనిపై సభలో చర్చ కొనసాగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని