Siddaramaiah: కాంగ్రెస్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు..?

ఐటీ దాడులతో కాంగ్రెస్‌ పార్టీ నేతలనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Published : 10 Dec 2023 18:39 IST

బెంగళూరు: ఝార్ఖండ్‌, ఒడిశాలలో కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహూకు చెందిన మద్యం కంపెనీపై ఐటీశాఖ జరిపిన దాడుల్లో సుమారు రూ.వందల కోట్ల విలువైన కరెన్సీ లభ్యమైన విషయం తెలిసిందే. ఐదోరోజు కూడా వాటి లెక్కింపు కొనసాగింది. ఈ వ్యవహారంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆచితూచి స్పందిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. భాజపా నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

Freebies: ‘ఉచిత’ పథకాలపై ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ కీలక వ్యాఖ్యలు

‘వాళ్లు (భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం) కేవలం కాంగ్రెస్‌నే లక్ష్యంగా చేసుకున్నారు. భాజపా నేతలపైనా దాడులు చేయనివ్వండి. వాళ్ల దగ్గర (అక్రమ సంపాదన) ఎంత ఉందో అప్పుడు తెలుస్తుంది’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఐటీ చట్ట ప్రకారం నల్లధనాన్ని కూడబెట్టుకున్నా తప్పేనని.. చట్టప్రకారం వారిపై ఐటీశాఖ చర్యలు ఉంటాయన్నారు. అయితే, కేవలం కాంగ్రెస్‌ నేతలపైనే వారి దాడులు ఎందుకని ప్రశ్నించిన ఆయన.. భాజపా నేతలపై దాడులు చేసినా భారీ నగదు బయట పడుతుందన్నారు.

వివరణ కోరాం : కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ కుమార్‌ సాహు కంపెనీలో భారీ నగదు లభ్యమైన నేపథ్యంలో ఆయన నుంచి వివరణ కోరినట్లు ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ అవినాశ్‌ పాండే వెల్లడించారు. అయితే, అది ఆయన ప్రైవేటు వ్యవహారమని, పార్టీతో సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ కూడా ఇదివరకే నిర్ణయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఆయన కాంగ్రెస్‌ ఎంపీ అయినందున అంత మొత్తం ఎలా వచ్చిందో అధికారిక ప్రకటన చేయాల్సి ఉందన్నారు.

ఇదిలాఉంటే, ఒడిశాకు చెందిన బౌద్‌ డిస్టిలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు దానికి సంబంధమున్న కంపెనీలపై ఐటీ శాఖ చేసిన దాడుల్లో భారీ స్థాయిలో నగదు లభ్యమైంది. బీరువాలు, సంచుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ప్రత్యేక సిబ్బంది, కౌంటింగ్‌ మెషిన్లతో వాటిని లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.300 కోట్లు నగదు లెక్కించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని