T20 World Cup: ‘ఇది మహాయుద్ధం’.. టీమ్‌ఇండియాకు అమితాబ్‌ స్పెషల్‌ మెసేజ్‌

T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్‌ బచ్చన్‌ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు.

Updated : 02 May 2024 10:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇది మహాయుద్ధం.. మీరంతా సిద్ధం కండి’ అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan). మరికొద్ది రోజుల్లో పొట్టి కప్పు మహా సమరం (T20 World Cup 2024) ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా (Team India)కు ప్రత్యేక సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి 2898 ఎ.డి’లోని అశ్వత్థామ అవతారంలో వచ్చి బిగ్‌బీ క్రికెటర్లలో స్ఫూర్తి నింపారు.

ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ‘టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం శంఖనాదం మోగింది’ అంటూ దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో అశ్వత్థామగా అమితాబ్‌ క్రికెటర్లలో ప్రేరణ నింపేలా కావ్యాన్ని చెబుతుండగా బ్యాగ్రౌండ్‌లో ‘కల్కి (Kalki 2898 AD)’ సినిమా మ్యూజిక్‌ వినిపించింది. ‘‘ఇది మహా యుద్ధం. గొప్ప పోరాటం. విజయం ముందు మీరు తలవంచొద్దు. ధైర్యంగా ఉండండి.. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించండి.. బలాన్ని చూపండి..! ప్రతి తల్లి గర్వపడేలా చేయండి. శత్రువు కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి. అప్పుడు దేశం కోసం మీరు సిద్ధమవుతారు’’ అని బిగ్‌బీ క్రికెటర్లకు పిలుపునిచ్చారు.

అమితాబ్‌ గళం వినిపిస్తుండగా తెరపై రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య తదితర క్రికెటర్లను చూపించారు. వీరితో పాటు దేశానికి ప్రపంచకప్‌ను అందించిన మహేంద్రసింగ్‌ ధోనీ, నాటి సంబరాలను ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆటలంటే అమితాబ్‌కు చాలా ఆసక్తి. వీలు కుదిరినప్పుడల్లా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షిస్తుంటారు. ఇటీవల ‘కల్కి 2898 ఎ.డి’ సినిమాలోని తన పాత్ర ఫస్ట్‌లుక్‌ను కూడా ఐపీఎల్‌ సీజన్‌లోనే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని