WI vs IND: సోషల్ మీడియాలో విమర్శించడం తేలికే.. విండీస్‌తో టీ20 సిరీస్‌ ఓటమిపై స్పందించిన అశ్విన్

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓటమిపాలుకావడంతో టీమ్‌ఇండియాపై విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) స్పందించాడు.

Published : 15 Aug 2023 16:36 IST

ఇంటర్నెట్ డెస్క్: విండీస్‌పై (WI vs IND) టెస్టు, వన్డే సిరీస్‌లను అలవోకగా కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా (Team India) టీ20 సిరీస్‌లో మాత్రం తడబడింది. ఐదు టీ20ల సిరీస్‌ని 3-2 తేడాతో చేజార్చుకుని విమర్శలపాలవుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌నకు అర్హత కూడా సాధించని విండీస్‌ చేతిలో సిరీస్‌ను కోల్పోవడంపై ఏంటని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఫైరవుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్‌, తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో టీమ్ఇండియా ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో భాగమైన రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. టీ20 సిరీస్‌ ఓటమిపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. సోషల్ మీడియాలో విమర్శించడం తేలికే అని.. ఈ సిరీస్‌తో భారత్‌కు ఎన్నో సానుకూలతలు ఉన్నాయని పేర్కొన్నాడు.

టీ20లంటే పూనకమే... పొట్టి క్రికెట్‌ ప్రమాదకారి విండీస్

‘‘ఈ టీ20 సిరీస్‌లో భారత్‌కు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. గత టీ20 ప్రపంచ కప్‌నకు అర్హత సాధించని టీమ్‌ (వెస్టిండీస్‌)తో ఓడిపోవడం వల్ల సోషల్ మీడియాలో జట్టు(టీమ్‌ఇండియా)ను విమర్శించడం చాలా సులభం. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. వారు (విండీస్‌) రాబోయే వన్డే ప్రపంచకప్‌నకు కూడా అర్హత సాధించలేదు. నేను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు. మద్దతుగా మాట్లాడటం లేదు. ఈ విషయాలు అంత  ముఖ్యమైనవి కావు. యువ ఆటగాడిగా వెస్టిండీస్‌కు వెళ్లినప్పుడు అక్కడ కొన్ని సవాళ్లు ఉంటాయి. అన్ని దేశాలలో కొన్ని సహజ రహస్యాలు ఉంటాయి. పర్యాటక దేశ ఆటగాళ్ల కంటే స్థానిక ఆటగాళ్లకు ఈ విషయాలు ఎక్కువగా తెలిసుంటాయి.

నేను వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు రకరకాల చిన్న చిన్న విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. క్రికెటర్‌గా నాకు ఇవే మొదటి అనుభవం. ఈ పర్యటనలో యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకున్నారు. వారు మరోసారి విండీస్‌కు వెళ్లినప్పుడు మంచి ప్రదర్శన కనబరుస్తారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో ఓడిపోవడంతో టీమ్‌ఇండియాపై విమర్శలు వస్తున్నాయి.  ఇలా చేయడం సరైందే అనుకుంటున్నా. కానీ, మనం ఈ ఓటమిని రెండు కోణాల్లో చూడాలి. ఈ సిరీస్‌తో ఆటగాళ్లు అనుభవాన్ని పొందారు’’ అని అశ్విన్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు