INDw vs AUSw: ‘కంగారూ’ను జయిస్తేనే ఫైనల్‌కు..

Eenadu icon
By Sports News Team Updated : 29 Oct 2025 15:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రపంచ కప్‌ (ICC Womens World Cup 2025) ఆఖరి దశకు చేరుకుంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్ఇండియా (Team India).. ఆశించిన మేరకు ప్రదర్శన చేయకపోయినా కాస్త అదృష్టం తోడవడంతో నాలుగో స్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. వర్షం అంతరాయంతో టోర్నీలో ఇతర జట్లకు సంబంధించిన చాలా మ్యాచ్‌లు రద్దు కాగా.. భారత్ ఏడు పాయింట్లతో నాకౌట్‌ దశకు క్వాలిఫై అయింది. కానీ, ఇక్కడితో సంబరపడొద్దు. అసలు సిసలు పరీక్ష ముందుంది. ఇప్పటివరకు రెండుసార్లు ఫైనల్ చేరినా కప్పు కలను సాకారం చేసుకోలేకపోయిన టీమ్ఇండియా.. మూడోసారి టైటిల్‌ పోరుకు దూసుకెళ్లాలంటే ముందుగా ‘కంగారూ’ను జయించాలి. అక్టోబర్ 30న జరిగే రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను హర్మన్‌ప్రీత్ సేన అమీ తుమీ తేల్చుకోనుంది.

డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా (Australia)ను ఓడించడం భారత్‌కు అంత తేలిక కాదు. ఇప్పటికే లీగ్ దశలో కంగారూలతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 330 పరుగులు చేసినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఎల్లిస్ పెర్రీ, ఆష్లీన్ గార్డ్‌నర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్‌ మూనీలతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. వీరంతా ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా ఉన్నవాళ్లే. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ భారత్‌తో సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది భారత్‌కు ఉపశమనాన్ని ఇచ్చే అంశం. బౌలింగ్‌లో ప్రధానంగా అలానా కింగ్, అన్నాబెల్ సదర్లాండ్‌తో భారత్‌కు ముప్పుంది. సోఫీ మోలినెక్స్, ఆష్లీన్ గార్డ్‌నర్ కూడా బంతితో రాణిస్తే టీమ్ఇండియాకు ఇబ్బందులు తప్పవు. సెమీస్‌కు ముందు ఫామ్‌లో ఉన్న ప్రతీక రావల్‌ గాయంతో టోర్నీకి దూరమవడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, హర్లిన్ డియోల్‌, హర్మన్‌ప్రీత్ సింగ్, దీప్తి శర్మ, రిచా ఘోష్‌లతో పేపర్ మీద టీమ్ఇండియా బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తున్నా వీరు ఏ మేరకు రాణిస్తారనే దానిపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. క్రాంతి గౌడ్, శ్రీచరణి, దీప్తి, రేణుకా సింగ్ బంతితో మెరిస్తే ఆసీస్‌కు షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లడం ఖాయం!

మహిళల క్రికెట్లో ఇప్పటిదాకా 12 వన్డే ప్రపంచకప్‌లు జరగ్గా.. భారత్ నాలుగుసార్లు సెమీస్‌కు చేరింది. ప్రస్తుతం జరుగుతోన్న 13వ ఎడిషన్‌లో భారత్‌ మరోసారి నాకౌట్‌ దశకు అర్హత సాధించగలిగింది. 1997లో ఆస్ట్రేలియా, 2005లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైంది. 2005లో కివీస్‌ని 40 పరుగుల తేడాతో మట్టికరిపించిన మిథాలి రాజ్‌ సేన.. తుది పోరులో ఆస్ట్రేలియా జోరు ముందు నిలవలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2017లో కప్పు గెలిచేందుకు భారత అమ్మాయిలకు మంచి అవకాశమే వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. సెమీస్‌లో భీకర ఆస్ట్రేలియాను ఓడించిన భారత్‌.. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో 9 పరుగుల తేడాతో ఓడి విశ్వవిజేతగా నిలిచే ఛాన్స్‌ను మిస్‌ చేసుకుంది. ఇప్పుడు టైటిల్‌కు మరో రెండు అడుగుల దూరంలో నిలిచిన టీమ్ఇండియా.. సెమీస్‌లో ‘ఆస్ట్రేలియా’ గండాన్ని దాటితే.. ఫైనల్‌లో ఇంగ్లాండ్ లేదా సౌతాఫ్రికాతో తలపడుతుంది.

Tags :
Published : 29 Oct 2025 15:10 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు