Team India: ఆఖరిసారి ఆడాలని ఉంది: డీకే

రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో కనీసం ఒక్కసారైనా టీమ్ఇండియా తరఫున ఆడాలని ఉందని వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో...

Published : 09 Jul 2021 01:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో కనీసం ఒక్కసారైనా టీమ్ఇండియా తరఫున ఆడాలని ఉందని వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అతను ఫిట్‌నెస్‌తో కొనసాగినంత కాలం క్రికెట్‌ ఆడతానని స్పష్టంచేశాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఈ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆటపై తనకింకా మక్కువ పోలేదని చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో విఫలమవ్వడం వల్లే తనని టీ20 జట్టు నుంచి తప్పించారన్నాడు.

‘నేను ఫిట్‌గా ఉన్నంతకాలం క్రికెట్‌ ఆడాలనుకుంటున్నా. రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో భారత్‌ తరఫున ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నా. 2019 వన్డే ప్రపంచకప్‌లో విఫలమైన నేపథ్యంలో టీమ్‌ఇండియా నుంచి తొలగించేవరకు నాకు ఆ టీ20 జట్టుతో మంచి అనుబంధం ఉంది’ అని కార్తీక్‌ చెప్పుకొచ్చాడు. అలాగే రాబోయే ప్రపంచకప్‌లో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగే అవకాశముందని కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో భాగంలో మంచి ప్రదర్శన చేస్తే తుది జట్టులోకి ఎంపికయ్యే వీలుందని అన్నాడు.

‘నేనింకా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడుతున్నా. టీమ్‌ఇండియాకు టీ20ల్లో సరైన మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కావాలి. ఇప్పుడు జట్టు నిండా టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెనే ఉన్నారు. హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా మినహా మిడిల్‌ ఆర్డర్‌లో సరైన బ్యాట్స్‌మన్‌ లేరు. టాప్‌ ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో ఆయా జట్లకు ఒకటి నుంచి మూడు స్థానాల్లోనే బ్యాటింగ్‌ చేస్తున్నారు. పంత్‌ ఒక్కడే నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు. అలాంటప్పుడు రాబోయే ఐపీఎల్‌లో రాణిస్తే మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది’ అని వెటరన్‌ బ్యాట్స్‌మెన్‌ తన అభిప్రాయం వెల్లడించాడు. ఇదిలా ఉండగా, 2004 నుంచి సుదీర్ఘకాలంగా టీమ్‌ఇండియాతో కొనసాగుతున్నా డీకే 2007 వన్డే ప్రపంచకప్‌, 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలోనే కెరీర్‌ ముగింపు దశలో ఉన్న అతడు చివరగా ఒకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని