ODI WC 2023: నిర్వహణ లోపమా.. అనాసక్తా?

Published : 08 Oct 2023 15:34 IST

ప్రపంచకప్‌లో కంగారెత్తిస్తున్న ఖాళీ స్టేడియాలు

క్రికెట్‌ అంటే పడిచచ్చే భారత్‌లో ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023). ప్రపంచంలోనే అతి పెద్దదైన స్టేడియంలో తొలి మ్యాచ్‌. బీసీసీఐని అన్నీ తానై నడిపించే కార్యదర్శి జై షా సొంత నగరంలో జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో ఆయన మద్దతుదారులు దీన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో తొలి మ్యాచ్‌కు స్టేడియం చాలా వరకు నిండిపోతుందని.. జనాల కేరింతలతో తొలి మ్యాచ్‌ హోరెత్తిపోతుందని అంతా అంచనా వేశారు. తీరా చూస్తే ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్లేక స్టేడియం వెలవెలబోయింది. హైదరాబాద్‌లో జరిగిన రెండో మ్యాచ్‌కు సైతం ఇదే పరిస్థితి. ఇది నిర్వహణ లోపమా.. లేక ప్రపంచకప్‌ మీద జనాలకు ఆసక్తి తగ్గిపోతోందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడంతా టీ20లదే హవా అన్నది వాస్తవం. టెస్టులు, వన్డేలకు ఆదరణ క్రమంగా తగ్గిపోతున్న మాట కూడా నిజమే. అలా అని ప్రపంచకప్‌లో సైతం వన్డేలను అభిమానులు లైట్‌ తీసుకుంటారని భావించడం లేదు. ఎందుకంటే గత మూడు వన్డే ప్రపంచకప్‌లకూ జనాదరణ తక్కువగా ఏమీ లేదు. భారత్‌ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్‌ సమయంలో అభిమానులు ఎలా వెర్రెత్తిపోయారో తెలిసిందే. భారత్‌ ఆడని మ్యాచ్‌లకు కూడా జనం బాగానే వచ్చారు. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఆతిథ్యమిచ్చిన కప్, 2019లో ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన టోర్నీలో కూడా స్టేడియాలు జనాలతో కళకళలాడాయి. గత కొన్నేళ్లలో వన్డేలకు ఆదరణ మరింత తగ్గినప్పటికీ.. ప్రపంచకప్, అందులోనూ భారత్‌లో జరిగే టోర్నీకి జనాలు బాగానే వస్తారని అంచనా వేశారు. బీసీసీఐ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హైప్‌ తీసుకొస్తుందని.. భారతేతర మ్యాచ్‌లకూ జనం వస్తారని భావించారు. కానీ తొలి మ్యాచ్‌ ఈ ఆశలపై నీళ్లు చల్లింది.

నిజానికి ఈ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు ఆన్‌లైన్లో ఓపెన్‌ చేసినపుడు చకచకా అమ్ముడైపోయినట్లు వార్తలొచ్చాయి. తీరా చూస్తే మ్యాచ్‌ ఆరంభ సమయానికి లక్షా 20 వేల సామర్థ్యమున్న స్టేడియంలో పదో వంతు కూడా నిండలేదు. సాయంత్రానికి జనం పెరిగినా  సగం కూడా ఫుల్‌ కాలేదు. ఈ మ్యాచ్‌ టికెట్లను పెద్ద సంఖ్యలో బ్లాక్‌ చేసి బీజేపీ నాయకులు సొంతం చేసుకున్నారట. అయితే వాళ్లు ఉచితంగా టికెట్లు పంచినా కూడా జనం మ్యాచ్‌ చూసేందుకు స్టేడియానికి రాలేదట. భారత్‌ మ్యాచ్‌ అయితే ఎగబడేవారు కానీ.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ తలపడటంతో అంతగా ఆసక్తి కనిపించలేదు. ఇక హైదరాబాద్‌లో పాకిస్థాన్, నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌కు ఈ మాత్రం స్పందన కూడా లేదు. ఆరంభ సమయానికి ఉన్న జనం 5 వేల లోపే. అభిమానుల సంఖ్య అత్యధికంగా 8200కు మించలేదు. పాక్, ఆస్ట్రేలియా మధ్య కొన్ని రోజుల కిందట జరిగిన వార్మప్‌ మ్యాచ్‌కు ఇదే స్థాయిలో జనం వచ్చారు. అసలు మ్యాచ్‌కు మాత్రం ఆశించిన స్పందన లేదు.

కారణాలేంటి?

వన్డే మ్యాచ్‌లు అంటే మధ్యాహ్నం మొదలవుతాయి. పని దినాల్లో సెలవు పెట్టి మరీ మధ్యాహ్నం నుంచే మ్యాచ్‌లు చూడటానికి రావడం కష్టం. టీ20లు అంటే సాయంత్రం వచ్చి మూడు గంటలు ఎంజాయ్‌ చేసి వెళ్లిపోతారు. కానీ ఎనిమిది గంటల పాటు సాగే వన్డే మ్యాచ్‌లు చూసేందుకు ఈ రోజుల్లో జనాలకు ఓపిక ఉండట్లేదు. గతంలో అంటే వన్డేలకు ఆకర్షణ వేరుగా ఉండేది. టీ20లు వచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రపంచకప్‌ అన్నా సరే.. వేరే జట్లు తలపడితే టికెట్లు పెట్టుకుని స్టేడియాలకు వెళ్లాలన్నంత ఆసక్తి జనాల్లో కనిపించడం లేదు. దీనికి తోడు ఈసారి నిర్వహణ లోపాలు కూడా ఉన్న మాట వాస్తవం అంటున్నారు విశ్లేషకులు.

ప్రపంచకప్‌నకు సరైన ప్రచారం కల్పించడంలో, అభిమానుల్లో ఉత్సాహం పెంచడంలో ఐసీసీ, బీసీసీఐ విఫలమయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి. టికెట్ల అమ్మకాలు ఆలస్యం చేయడం, వాటి నిర్వహణ కూడా సరిగా లేకపోవడం కూడా ప్రతికూలమైనట్లు కనిపిస్తోంది. ప్రపంచకప్‌ ఆరంభ సమయానికి ఆసియా క్రీడలు జరుగుతుండటం వల్ల పూర్తి స్థాయిలో టోర్నీ మీద అభిమానులు, మీడియా దృష్టిపెట్టకపోవడానికి ఓ కారణమే. టోర్నీలో భారత్‌ మ్యాచ్‌ మొదలైతే వచ్చే ఊపే వేరుగా ఉంటుందని భావిస్తున్నారు. ఆదివారం చెన్నైలో తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది భారత్‌. ఆ మ్యాచ్‌ టికెట్లకు డిమాండ్‌ మామూలుగా లేదు. వెయ్యి రూపాయల టికెట్‌ బ్లాక్‌లో రూ.25 వేలు పలుకుతోందట. ఆపై శనివారం భారత్‌-పాక్‌ మ్యాచ్‌కైతే 50 వేలు పెట్టినా టికెట్‌ దొరికే పరిస్థితి లేదు. తొలి మ్యాచ్‌కు వెలవెలబోయిన మోడీ స్టేడియం ఆ రోజు నిండుగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఒకసారి భారత్‌ మ్యాచ్‌ జరిగితే.. కొన్ని ఉత్కంఠభరిత పోరాటాలు చూస్తే అభిమానుల్లో ఉత్సాహం రావచ్చు. అలాగే వారాంతాల్లో ఆసక్తికర మ్యాచ్‌లు ఉంటే స్పందన బాగానే ఉంటుందని ఆశిస్తున్నారు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు