Shreyas Iyer: శ్రేయస్‌ ‘షార్ట్‌’ టెంపర్‌.. ఆ బలహీనతే బౌలర్లకు ఆయుధం..!

టీమ్‌ ఇండియా నంబర్-4 సమస్య మళ్లీ మొదటికొచ్చే పరిస్థితి నెలకొంది. ఈ స్థానం కోసం జట్టులోకి వచ్చిన అయ్యర్‌ (Shreyas Iyer) షార్ట్‌పిచ్‌ బాల్స్‌ సిండ్రోమ్‌ నుంచి బయటపడటంలేదు. అతడి కెరీర్‌లోనే అది ఓ భయంకరమైన బలహీనతగా మారే ప్రమాదం ఉంది.  

Updated : 02 Nov 2023 09:57 IST

ఇంటర్నెట్‌డెస్క్: టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రధాన సమస్య ‘నంబర్‌-4’..! శ్రేయస్‌ అయ్యర్‌ ((Shreyas Iyer))గాయం నుంచి కోలుకొని రావడంతో ఈ స్థానానికి ఇబ్బందిలేదని జట్టు మేనేజ్‌మెంట్‌ భావించింది. కానీ, టోర్నీ మొదలయ్యాక మాత్రం పరిస్థితి తారుమారైంది. ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం 134 పరుగులు చేశాడు. టోర్నీలో టీమ్‌ ఇండియా కష్టాల్లో ఉన్న సమయాల్లో ఆదుకొన్న ఇన్నింగ్స్‌ ఒక్కటి కూడా లేదు. వీటన్నింటికి మించి పదేపదే షార్ట్‌పిచ్‌ బంతులను పుల్‌ చేసేందుకు ప్రయత్నించి వికెట్లను సమర్పించుకోవడం ఆందోళనకరంగా మారింది. ఆసీస్‌ సీమర్‌ హేజిల్‌వుడ్‌, న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, ఇంగ్లిష్‌ బౌలర్‌ వోక్స్‌ ఇప్పటికే శ్రేయస్‌ బలహీనతను వాడుకొన్నారు. 

శ్రేయస్‌ కెరీర్‌లో దేశీయంగా జరిగిన వన్డేల్లో 8 సార్లు ఇలానే అవుటయ్యాడు.. ఇక విదేశీ వేదికలపై 6 సార్లు వికెట్‌ను సమర్పించుకొన్నాడు. అంటే వన్డేల్లో మొత్తంగా 48 ఇన్నింగ్సుల్లో 5 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇక 14సార్లు.. అంటే కెరీర్‌లో దాదాపు మూడో వంతు పుల్‌షాట్లకు యత్నించే పెవిలియన్‌కు చేరాడు. ఇంత పెద్ద లోపాన్ని ప్రత్యర్థి బౌలర్లు గమనించలేదనుకుంటున్నాడో ఏమో.. కీలకమైన ప్రపంచకప్‌లో కూడా ఇలానే మూడుసార్లు  వికెట్లను పోగొట్టుకున్నాడు. 

ఇప్పుడు అయ్యర్‌ (Shreyas Iyer) స్థానానికి సెగ..

గాయం కారణంగా హార్దిక్‌ పాండ్యా, పేలవ ప్రదర్శనతో శార్దూల్‌ జట్టులో స్థానం కోల్పోవడంతో.. రిజర్వు బెంచ్‌పై కాలం గడపుతున్న టీ20 సూపర్‌ స్టార్‌ సూర్య జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌట్‌ అయినా.. ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో మాత్రం బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ అందించాడు. దీంతో జట్టు చాలా బ్యాలెన్స్‌గా కనిపించింది. ఇప్పుడు హర్దిక్‌ తిరిగి జట్టులో చేరితో ఫామ్‌లో లేని శ్రేయస్‌ను రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం చేసి సూర్యాను నంబర్‌-4గా ప్రమోట్‌ చేయాలని గావస్కర్‌ వంటి సీనియర్లు సూచించడం మొదలుపెట్టారు. 

సీనియర్లు ఏమంటున్నారంటే..

టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అయ్యర్‌కు కొన్ని సలహాలిచ్చాడు. షార్ట్‌ బంతి వేస్తే పుల్‌షాట్‌ కొట్టాలని అయ్యర్‌ ముందుగానే సిద్ధంగా ఉండటం సమస్యకు కారణమని పేర్కొన్నాడు. ముందు అతడి మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని పేర్కొన్నాడు.‘‘నెట్స్‌లో సాధన చేసినట్లే ఆడాలనేమీ లేదు.. అతడు మాత్రం అలానే ఆడాలని యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.  అతడు షార్ట్‌ బాల్స్‌ వచ్చే వరకు ఎదురు చూస్తున్నాడే గానీ.. ముందుకెళ్లి బంతిని అతడి నియంత్రణలో ఉంచుకొంటూ.. సాధ్యమైనంత ఎత్తు వరకే పుల్‌ చేయడంలేదు. తాజా మ్యాచ్‌లో చూడండి.. ప్రతి బంతిని పుల్‌ చేయాలని చూస్తున్నాడు.. అంతర్జాతీయ ఆటగాళ్ల బౌలింగ్‌లో మీరు అలా చేయకూడదు. మీరు పూర్తిగా నియంత్రణలో ఉంచుకోగలిగిన వాటినే పుల్‌ చేయాలి’’ అని గంభీర్‌ విశ్లేషించాడు. 

ఇంకొక్క అడుగు

ఇక పాక్‌ మాజీ ఆటగాడు మిస్బా కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. అయ్యర్‌ తరచూ షార్ట్‌ బాల్స్‌ ఆశిస్తాడని  పేర్కొన్నాడు. అంతేకాదు.. షార్ట్‌-ఆఫ్‌-లెంగ్త్‌ బంతులను కూడా పుల్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు. అస్సలు వీటిని పుల్‌ చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని పేర్కొన్నాడు. షార్ట్‌బాల్స్‌ గురించి ఎక్కువగా ఆలోచిస్తే సమస్యల్లో పడ్డట్లే అని పేర్కొన్నాడు. షార్ట్‌బాల్స్ ఆడే సమయంలో అతడి ఫుట్‌వర్క్‌ కూడా మెరుగుపడాలన్నాడు.

గతంలో రైనా కూడా ఇంతే..

వైట్‌బాల్‌ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో రైనా ఒకడు. ఐపీఎల్‌ టాప్‌ స్కోరర్ల జాబితాలో ఉన్నాడు. కానీ, కెరీర్‌లో అత్యధిక కాలం శ్రేయస్‌ వలే షార్ట్‌బాల్స్‌ ఆడటంతో తీవ్ర అవస్థలు పడ్డాడు. అతడి బలహీనతను ప్రత్యర్థి బౌలర్ల తరచూ వాడుకొని దెబ్బతీసేవారు. దీనిని అధిగమించేందుకు అతడు గంగూలీతో కలిసి పనిచేసినా.. పూర్తిగా సాధ్యం కాలేదు. ముఖ్యంగా ‘సెనా’ (SENA) దేశాల పిచ్‌లపై అతడు తీవ్రంగా అవస్థలు పడ్డాడు. తాజాగా ఇప్పుడు శ్రేయస్‌ వంటి ఆటగాడు షార్ట్‌బాల్స్‌కు అవస్థలు పడుతున్నాడు. కానీ, కెప్టెన్‌ రోహిత్‌ మాత్రం అయ్యర్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నాడు. గతంలో ఓ ఆంగ్ల పత్రిక వద్ద రోహిత్‌ మాట్లాడుతూ ‘‘శ్రేయస్‌ గాయపడటంతో జట్టులో 4వ స్థానం కోసం చాలా మంది ఆటగాళ్లను ప్రయత్నించాము. కానీ, వారు అవకాశాలను అందిపుచ్చుకోలేదు. కానీ, శ్రేయస్‌ తిరిగి జట్టులోకి వచ్చాక నా సమస్యలు తీరతాయి’’ అని పేర్కొన్నాడు. దీంతో అయ్యర్‌ కుదురుకొనేందుకు తగినంత సమయాన్ని రోహిత్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. దీనిని అయ్యర్‌ వాడుకొని షార్ట్‌బాల్‌ సిండ్రోమ్‌ నుంచి వీలైనంత త్వరగా బయటపడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని