IND vs SL: ఇంకొక్క అడుగు

ఆరుకు ఆరు విజయాలు.. వన్డే ప్రపంచకప్‌లో ఒకే ఒక్క అజేయ జట్టు మనదే. ఇప్పటికే దాదాపుగా సెమీస్‌ చేరినట్లే. కానీ అధికారికంగా బెర్తు సొంతం కావాలంటే ఇంకొక్క అడుగు వేయాలి. ఆ అడుగు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

Updated : 02 Nov 2023 09:32 IST

నేడు లంకతో భారత్‌ పోరు
గెలిస్తే అధికారికంగా సెమీస్‌కు
మధ్యాహ్నం 2 నుంచి
ముంబయి

ఆరుకు ఆరు విజయాలు.. వన్డే ప్రపంచకప్‌లో ఒకే ఒక్క అజేయ జట్టు మనదే. ఇప్పటికే దాదాపుగా సెమీస్‌ చేరినట్లే. కానీ అధికారికంగా బెర్తు సొంతం కావాలంటే ఇంకొక్క అడుగు వేయాలి. ఆ అడుగు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ లాంటి మేటి జట్లు విసిరిన సవాళ్లను కూడా కాచుకుని విజయాలు సాధించిన టీమ్‌ఇండియా.. ఇప్పుడిక బలహీన శ్రీలంకతో పోరుకు సిద్ధమైంది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మరో ఘనవిజయం, దాంతో పాటు సెమీస్‌ బెర్తు సొంతమైనట్లే.

ప్రపంచకప్‌లో ఆడిన ఆరు వన్డేల్లో ఒక్క ఓటమీ లేకుండా సెమీస్‌కు అత్యంత చేరువగా వచ్చిన టీమ్‌ఇండియా.. నాకౌట్‌ బెర్తును అధికారికంగా సొంతం చేసుకోవడంపై దృష్టిపెట్టింది. గురువారం రోహిత్‌ సేన.. శ్రీలంకను ఢీకొనబోతోంది. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు ఓడి సెమీస్‌ రేసులో బాగా వెనుకబడింది లంక. చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ చేతిలో చిత్తుగా ఓడటం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత దెబ్బ తీసేదే.

శ్రేయస్‌ అందుకుంటాడా?: టోర్నీ ముందుకు సాగేకొద్దీ టీమ్‌ఇండియా బలం పెరుగుతోంది. ప్రధాన ఆటగాళ్లందరూ ఊపందుకున్నారు. హార్దిక్‌ పాండ్య దూరం కావడంతో కూర్పు మారి తుది జట్టులో అవకాశం దక్కించుకున్న ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి, మిడిలార్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం సత్తా చాటారు. కానీ ఒక్క శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్‌ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన శ్రేయస్‌ 134 పరుగులే చేశాడు. అందులో ఒక్క అర్ధశతకమే ఉంది. గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై జట్టు కష్టాల్లో ఉండగా అవసరం లేని షాట్‌ ఆడి వెనుదిరగడంతో శ్రేయస్‌ తీవ్ర విమర్శల పాలయ్యాడు. లంకపై సత్తా చాటకపోతే.. ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సి వస్తుంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ మంచి లయలోనే కనిపిస్తున్నా అతను కూడా భారీ ఇన్నింగ్స్‌ బాకీ పడ్డాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌తో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కోహ్లి ఇంగ్లాండ్‌పై డకౌటైనా.. టోర్నీలో తన ఫామ్‌ బాగుంది. రాహుల్‌ కూడా మిడిలార్డర్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడె పిచ్‌పై భారీ స్కోరు చేయడానికి భారత్‌కిది మంచి అవకాశమే. బౌలింగ్‌లో భారత్‌కు పెద్ద సమస్యలేమీ లేవు. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన షమి చెలరేగిపోతుంటే.. బుమ్రా, కుల్‌దీప్‌, జడేజా నిలకడను కొనసాగిస్తున్నారు. సిరాజ్‌ స్థానంలో ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ను ఆడించే అవకాశం లేకపోలేదు.

లంక నిలుస్తుందా?: ఆరు మ్యాచ్‌లాడి రెండే నెగ్గిన లంక.. ఈ మ్యాచ్‌లో ఓడితే సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే అవుతుంది. టోర్నీలో ఇంగ్లాండ్‌ను ఓడించడం మినహా ఆ జట్టు ప్రదర్శన పేలవమే. కెప్టెన్‌ శానకతో పాటు పతిరన, కుమార గాయాలతో దూరం కావడం జట్టును దెబ్బ తీసింది. మిగతా ఆటగాళ్లలో నిలకడ కొరవడింది. ఆరంభంలో అదరగొట్టిన కుశాల్‌ మెండిస్‌.. శానక స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్నాక రాణించలేకపోతున్నాడు. నిశాంక పర్వాలేదు. ధనంజయ డిసిల్వా ఆల్‌రౌండ్‌ పాత్రలో తేలిపోతున్నాడు. బౌలింగ్‌లో తీక్షణ నిరాశ పరుస్తున్నాడు. భారత్‌తో మ్యాచ్‌లో వీళ్లెలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. టోర్నీలో సత్తా చాటుతున్న పేసర్‌ మదుశంకతో పాటు ఆలస్యంగా జట్టులోకి వచ్చిన మాథ్యూస్‌ మీద ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.


తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, సూర్యకుమార్‌, జడేజా, కుల్‌దీప్‌, షమి, బుమ్రా, సిరాజ్‌/ అశ్విన్‌.

శ్రీలంక: నిశాంక, దిముత్‌ కరుణరత్నె, కుశాల్‌ మెండిస్‌ (కెప్టెన్‌), సమరవిక్రమ, అసలంక, మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వా, తీక్షణ, చమీర, మదుశంక, రజిత.


పరుగుల పండగేనా?

వాంఖడె పిచ్‌ ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలం. ప్రస్తుత ప్రపంచకప్‌లో కూడా బ్యాటర్లకు అత్యంత సహకరిస్తున్న పిచ్‌ ఇదే. ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా వరుసగా 399, 382 పరుగులు చేసింది. గురువారం కూడా వికెట్‌ భిన్నంగా ఏమీ ఉండదని అంచనా. మొదట ఎవరు బ్యాటింగ్‌ చేసినా 300 దాటడం ఖాయం కావచ్చు. భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేసి, మన స్టార్‌ బ్యాటర్లు అంచనాలకు తగ్గట్లు రాణిస్తే 350-400 మధ్య స్కోరు నమోదు చేయొచ్చు. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది.


7

వన్డేల్లో మాథ్యూస్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ ఔటైన సందర్భాలు. అందులో రెండు డకౌట్లున్నాయి. మరే బౌలరూ అతణ్ని ఈ ఫార్మాట్లో ఇన్నిసార్లు ఔట్‌ చేయలేదు. మాథ్యూస్‌ బౌలింగ్‌లో రోహిత్‌ సగటు 14.71 మాత్రమే.


9

ప్రపంచకప్‌లో భారత్‌, శ్రీలంక తలపడ్డ మ్యాచ్‌లు. చెరో నాలుగు విజయాలు సాధించాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.


34

ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కోహ్లికి అవసరమైన పరుగులు. అది సాధిస్తే అత్యధికసార్లు ఒక ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్‌ (11) సరసన నిలుస్తాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని