RR vs LSG: 154 కొట్టి.. గెలిచేశారు

ఐపీఎల్‌-16లో నిలకడగా రాణిస్తున్న జట్ల మధ్య పోరులో లఖ్‌నవూ పైచేయి సాధించింది. బుధవారం ఆ జట్టు 10 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది.

Updated : 20 Apr 2023 11:38 IST

 రాజస్థాన్‌కు లఖ్‌నవూ షాక్‌
మెరిసిన మేయర్స్‌, స్టాయినిస్‌

9 ఓవర్లకు 74/0తో ఉన్న లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌.. చివరికి 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులే చేసింది.

200 పైచిలుకు లక్ష్యాలు కూడా సురక్షితం కాదన్నట్లుగా సాగుతున్న ఐపీఎల్‌లో.. విధ్వంసక బ్యాటర్లకు నెలవైన రాజస్థాన్‌కు ఈ స్కోరు ఏ మూలకు సరిపోతుందిలే అనుకుంటే.. ఇంత చిన్న లక్ష్యాన్ని కాపాడుకుని ఔరా అనిపించింది సూపర్‌జెయింట్స్‌.

రోజూ బ్యాటింగ్‌ మెరుపులే చూస్తున్న ఐపీఎల్‌లో చిన్న బ్రేక్‌ అన్నట్లుగా బౌలర్ల ఆధిపత్యం సాగిన పోరులో పైచేయి సాధించిన లఖ్‌నవూ.. సీజన్లో నాలుగో విజయంతో రాజస్థాన్‌ను సమం చేసింది.

జైపుర్‌: ఐపీఎల్‌-16లో నిలకడగా రాణిస్తున్న జట్ల మధ్య పోరులో లఖ్‌నవూ పైచేయి సాధించింది. బుధవారం ఆ జట్టు 10 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. మొదట లఖ్‌నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులే చేసింది. కైల్‌ మేయర్స్‌ (51; 42 బంతుల్లో 4×4, 3×6), కేఎల్‌ రాహుల్‌ (39; 32 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. అశ్విన్‌ (2/23), బౌల్ట్‌ (1/16) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం అవేష్‌ ఖాన్‌ (3/25), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్టాయినిస్‌ (2/28) సహా బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాయల్స్‌ నిర్ణీత ఓవర్లలో 144/6కు పరిమితమైంది. యశస్వి జైశ్వాల్‌ (44;  35 బంతుల్లో 4×4, 2×6) టాప్‌స్కోరర్‌.

మంచి ఆరంభం దక్కినా..: బట్లర్‌, యశస్వి, శాంసన్‌, పడిక్కల్‌, హెట్‌మయర్‌ లాంటి దూకుడైన ఆటగాళ్లతో కూడిన రాజస్థాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌కు 155 పరుగుల లక్ష్యం ఒక లెక్కా అనుకుంటే.. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఛేదన అంత తేలిక కాదని రుజువైంది. మొదట రాయల్స్‌ బౌలింగ్‌ చూసి ఆహా అనుకుంటే.. తర్వాత సూపర్‌జెయింట్స్‌ బౌలింగ్‌ చూసి ఔరా అనుకోవాల్సి వచ్చింది. నిజానికి ఛేదనలో రాజస్థాన్‌కు మంచి ఆరంభమే లభించింది. బంతి బ్యాట్‌ మీదికి రాకపోయినా.. యశస్వి జైశ్వాల్‌ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. మరో ఎండ్‌లో బట్లర్‌ (40; 41 బంతుల్లో 4×4, 1×6) మాత్రం పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఒక దశలో అతను 21 బంతుల్లో 16 పరుగులే చేయగలిగాడు. అతను కొంచెం కుదురుకున్నాక రాయల్స్‌ ఛేదన సాఫీగానే సాగుతున్నట్లు అనిపించింది. 12వ ఓవర్లో ఆ జట్టు 89/0తో పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ అదే ఓవర్లో స్టాయినిస్‌.. యశస్విని ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. అక్కడి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. శాంసన్‌ (2) రనౌటై వెనుదిరగ్గా.. బట్లర్‌ను సైతం స్టాయినిసే పెవిలియన్‌ చేర్చాడు. చివరి 5 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సి రాగా.. విధ్వంసక బ్యాటర్‌ హెట్‌మయర్‌ (2)ను అవేష్‌ ఔట్‌ చేయడంతో రాయల్స్‌కు కష్టమని తేలిపోయింది. అయితే ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (26) పోరాడటంతో రాయల్స్‌ ఆశలు వదులుకోలేదు. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా.. పడిక్కల్‌ కూడా అద్భుతాలేమీ చేయలేకపోయాడు. అవేష్‌ వేసిన ఈ ఓవర్లో పడిక్కల్‌, జూరెల్‌ (0) వరుస బంతుల్లో ఔటైపోవడంతో రాజస్థాన్‌కు దారులు మూసుకుపోయాయి.

లఖ్‌నవూ ఆపసోపాలు: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూకు పెద్ద స్కోరు చేయడానికి మంచి అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేకపోయింది. రాజస్థాన్‌ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బంతులేసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేశారు. పూరన్‌ (29; 20 బంతుల్లో 2×4, 1×6), స్టాయినిస్‌ (21; 16 బంతుల్లో 2×4) లాంటి హిట్టర్లు కలిసి ఆరు ఓవర్లు బ్యాటింగ్‌ చేసినా పెద్దగా షాట్లు ఆడలేకపోయారంటే రాయల్స్‌ బౌలింగ్‌ ఎంత కట్టుదిట్టంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. బౌల్ట్‌ (4-1-16-1) ఆరంభంలోనే లఖ్‌నవూ బ్యాటర్లను కట్టిపడేశాడు. అతడి తొలి ఓవర్‌ను రాహుల్‌ మెయిడెన్‌ ఆడాడు. దీంతో ధాటిగా ఆడే మేయర్స్‌ సైతం ఒత్తిడిలో పడ్డాడు. 4 ఓవర్లకు స్కోరు 18 పరుగులే. తర్వాత మేయర్స్‌, రాహుల్‌ కొంచెం దూకుడు పెంచడంతో స్కోరు బోర్డు కదిలింది. ఇద్దరూ కుదరుకున్నాక మరింత వేగం పెంచారు. 7-9 మధ్య మూడు ఓవర్లలో 31 పరుగులు రాబట్టి లఖ్‌నవూ.. 74/0తో మంచి స్థితికి చేరుకుంది. ఈ ఆరంభాన్ని ఉపయోగించుకుని ఆ జట్టు పెద్ద స్కోరు చేస్తుందనుకుంటే.. అందుకు భిన్నంగా జరిగింది. తర్వాతి మూడు ఓవర్లలో రాహుల్‌, బదోని (1)ల వికెట్లు కోల్పోయి 12 పరుగులు మాత్రమే చేయగలిగింది. తర్వాత అశ్విన్‌ ఒకే ఓవర్లో మేయర్స్‌, హుడా (2)లను ఔట్‌ చేసి లఖ్‌నవూను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. అయినప్పటికీ స్టాయినిస్‌, పూరన్‌ క్రీజులో ఉండటంతో చివరి 6 ఓవర్లలో సిక్సర్ల మోత మోగుతుందనుకుంటే.. రాయల్స్‌ బౌలర్లు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. స్టాయినిస్‌, పూరన్‌ షాట్లకు ప్రయత్నించి టైమింగ్‌ కుదరక ఇబ్బంది పడ్డారు. కొంచెం ఆలస్యంగా పూరన్‌ జోరందుకోవడంతో 19 ఓవర్లకు స్కోరు 146/4కు చేరుకుంది. చివరి ఓవర్లో సందీప్‌ 8 పరుగులే ఇచ్చాడు. రెండు రనౌట్లు సహా ఆ ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. చివరి 10 ఓవర్లలో లఖ్‌నవూ 7 వికెట్లు కోల్పోయి 75 పరుగులే చేయగలిగింది.


లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) హోల్డర్‌ 39; మేయర్స్‌ (బి) అశ్విన్‌ 51; బదోని (బి) బౌల్ట్‌ 1; దీపక్‌ హుడా (సి) హెట్‌మయర్‌ (బి) అశ్విన్‌ 2; స్టాయినిస్‌ (సి) శాంసన్‌ (బి) సందీప్‌ శర్మ 21; పూరన్‌ రనౌట్‌ 29; కృనాల్‌ నాటౌట్‌ 4; యుధ్‌వీర్‌ రనౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 154; వికెట్ల పతనం: 1-82, 2-85, 3-99, 4-104, 5-149, 6-153, 7-154; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-1-16-1; సందీప్‌ శర్మ 4-0-32-1; అశ్విన్‌ 4-0-23-2; చాహల్‌ 4-0-41-0; హోల్డర్‌ 4-0-38-1

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) అవేష్‌ (బి) స్టాయినిస్‌ 44; బట్లర్‌ (సి) బిష్ణోయ్‌ (బి) స్టాయినిస్‌ 40; సంజు శాంసన్‌ రనౌట్‌ 2; పడిక్కల్‌ (సి) పూరన్‌ (బి) అవేష్‌ 26; హెట్‌మయర్‌ (సి) రాహుల్‌ (బి) అవేష్‌ 2; రియాన్‌ పరాగ్‌ నాటౌట్‌ 15; జురెల్‌ (సి) హుడా (బి) అవేష్‌ 0; అశ్విన్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లకు 6 వికెట్లకు) 144; వికెట్ల పతనం: 1-87, 2-93, 3-97, 4-104, 5-141, 6-141; బౌలింగ్‌: నవీనుల్‌ హక్‌ 4-0-19-0; యుధ్‌వీర్‌ 2-0-27-0; అవేష్‌ ఖాన్‌ 4-0-25-3; స్టాయినిస్‌ 4-0-28-2; రవి బిష్ణోయ్‌ 4-0-25-0; అమిత్‌ మిశ్రా 2-0-15-0


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని