Jasprit Bumrah: బుమ్రా వచ్చేశాడు.. ఐర్లాండ్‌తో టీ20లకు సారథ్యం

భారత క్రికెట్‌ అభిమానులకు ఆనందాన్నిచ్చే వార్త. స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా సుదీర్ఘ విరామం తర్వాత టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేశాడు.

Published : 01 Aug 2023 06:27 IST

రింకు, జితేశ్‌కు అవకాశం
దిల్లీ

భారత క్రికెట్‌ అభిమానులకు ఆనందాన్నిచ్చే వార్త. స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) సుదీర్ఘ విరామం తర్వాత టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేశాడు. వెన్ను గాయంతో చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఈ ఉన్న ఈ పేసర్‌.. ఆగస్టు 18న ఐర్లాండ్‌తో ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌లో ఆడబోతున్నాడు. ఎక్కువమంది కుర్రాళ్లతో నిండిన ఈ జట్టుకు బుమ్రానే కెప్టెన్‌ కావడం విశేషం. గతేడాది సెప్టెంబర్‌లో సొంతగడ్డపై చివరిగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో ఆడిన బుమ్రా.. ఆ తర్వాత గాయంతో మైదానానికి దూరమయ్యాడు. శస్త్ర చికిత్స తర్వాత జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకున్న అతడు.. ఇటీవలే సాధన మొదలుపెట్టాడు. బుమ్రా మాదిరిగానే గాయంతో చాలారోజులుగా జట్టుకు దూరమై ఎన్‌సీఏలో కోలుకున్న పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా తిరిగి జట్టులోకొచ్చాడు. హార్దిక్‌ పాండ్య, శుభ్‌మన్‌ గిల్‌లకు విశ్రాంతి ఇవ్వడంతో రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయాల నుంచి కోలుకోని కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌లకు జట్టులో చోటు దక్కలేదు.

ఐపీఎల్‌ స్టార్లకు పిలుపు: ఐపీఎల్‌లో సత్తా చాటిన బ్యాటర్‌ రింకు సింగ్‌, వికెట్‌కీపర్‌ జితేశ్‌ శర్మలకు సెలక్టర్ల నుంచి తొలిసారి పిలుపొచ్చింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన యశస్వి జైస్వాల్‌, తిలక్‌వర్మలకు కూడా ఐర్లాండ్‌తో సిరీస్‌లో ఆడే జట్టులో చోటు దక్కింది. తాజా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన హార్డ్‌ హిట్టర్‌ శివమ్‌ దూబె కూడా టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఆసియా క్రీడల్లో ఆడే జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎక్కువమందిని ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు.

భారత జట్టు: బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, తిలక్‌వర్మ, రింకు సింగ్‌, సంజు శాంసన్‌, జితేశ్‌ శర్మ, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్‌, రవి బిష్ణోయ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌, అవేష్‌ ఖాన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని