Suryakumar Yadav: ‘సూర్య’ గ్రహణం వీడింది

సూర్యకుమార్‌.. ఈ పేరు వింటే చాలు 360 డిగ్రీల ఆటతీరుతో అతను సాగించే విధ్వంసం కళ్లముందు కదులుతుంది. ధనాధన్‌ క్రికెట్‌కు తనదైన శైలి బ్యాటింగ్‌తో కొత్త అర్థం చెప్పిన అతని షాట్లు గుర్తుకువస్తాయి.

Updated : 09 Aug 2023 09:29 IST

సూర్యకుమార్‌.. ఈ పేరు వింటే చాలు 360 డిగ్రీల ఆటతీరుతో అతను సాగించే విధ్వంసం కళ్లముందు కదులుతుంది. ధనాధన్‌ క్రికెట్‌కు తనదైన శైలి బ్యాటింగ్‌తో కొత్త అర్థం చెప్పిన అతని షాట్లు గుర్తుకువస్తాయి. క్రీజులో నాట్యం చేస్తూ.. బంతికి బౌండరీల మార్గం చూపిస్తూ.. బౌలర్లను కళాత్మక ఊచకోత కోయడం అతనికి అలవాటు. కానీ కొన్ని నెలలుగా అతని బ్యాట్‌ మూగబోయింది. పరుగుల వరద తగ్గిపోయింది. సంచలన ప్రదర్శన ఆగిపోయింది.

ఈ ఏడాది జనవరిలో శ్రీలంకపై టీ20లో అజేయ శతకం సాధించిన తర్వాత సూర్యకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఒక్కటీ లేదు. ఆ మ్యాచ్‌ తర్వాత మంగళవారం ముందు వరకూ అతను అయిదు టీ20లు, 10 వన్డేలు, ఓ టెస్టు ఆడాడు. అత్యధిక స్కోరు 47. అదీ జనవరిలో సాధించాడు. క్రీజులో నిలబడలేక.. పరుగులు చేయలేక.. వికెట్‌ సమర్పించుకోవడమే అతని వరసగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే అతను.. వరుసగా విఫలమవుతుంటే అభిమానులు ఆవేదన చెందారు. ఎట్టకేలకు సూర్య గ్రహణం వీడింది. విండీస్‌తో మూడో టీ20లో మరోసారి అతని విశ్వరూపం కనిపించింది. క్రీజులో కుడివైపు కదులుతూ.. ఎడమవైపు సిక్సర్లు, తల మీద నుంచి బౌండరీలు, కిందపడుతూ భారీ షాట్లు, ముందుకు వచ్చి బంతిని స్టాండ్స్‌లోకి పంపించడం.. ఇలా చాలా రోజుల తర్వాత సూర్య పరిపూర్ణ బ్యాటింగ్‌ మరోసారి కనువిందు చేసింది. విండీస్‌ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. ఛేదనను ఏకపక్షంగా మార్చేశాడు. కీలక మ్యాచ్‌లో రెచ్చిపోయి.. సిరీస్‌ కోల్పోయి ప్రమాదం నుంచి జట్టును తాత్కాలికంగా బయటపడేశాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో సూర్య ఇదే ఊపు కొనసాగిస్తే భారత అభిమానులకు పరుగుల పండగే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని