KL Rahul: ఆడే అవకాశం రాదని.. మైదానానికి కిట్‌ కూడా తెచ్చుకోలేదు: కేఎల్‌ రాహుల్‌

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తాను తుది జట్టులో ఉంటానని అనుకోలేదని అందుకే హోటల్‌ నుంచి మైదానానికి కిట్‌ కూడా తెచ్చుకోలేదని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు.

Updated : 14 Sep 2023 16:09 IST

కొలంబో: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తాను తుది జట్టులో ఉంటానని అనుకోలేదని అందుకే హోటల్‌ నుంచి మైదానానికి కిట్‌ కూడా తెచ్చుకోలేదని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను గాయం కారణంగా దూరం కావడంతో ఆఖరి నిమిషంలో కేఎల్‌కు చోటు కల్పించారు. తొడ గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన 31 ఏళ్ల రాహుల్‌.. పాకిస్థాన్‌పై 106 బంతుల్లో అజేయంగా 111 పరుగులు చేశాడు. ‘‘టాస్‌ వేయడానికి అయిదు నిమిషాల ముందు నేను తుది జట్టులో ఉన్నానని ద్రవిడ్‌ సమాచారం ఇచ్చాడు. శ్రేయస్‌కు గాయం కావడంతో నాకు ఆడే అవకాశమొచ్చింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు హోటల్‌ నుంచి మైదానానికి నా కిట్‌ తీసుకొచ్చేందుకు మేనేజర్‌ శ్రమించాల్సి వచ్చింది’’ అని రాహుల్‌ చెప్పాడు. పునరాగమనంలో తాను ఒత్తిడికి గురయ్యానని అతనన్నాడు. నిలదొక్కుకోవడానికి సమయం తీసుకున్నానని చెప్పాడు. ‘‘సుదీర్ఘ విరామం తర్వాత ఇది నా తొలి మ్యాచ్‌. కొన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాను కానీ.. తీవ్రత ఈ స్థాయిలో ఉండదని మనకు తెలుసు. ఈ నేపథ్యంలో క్రీజులో ఆడుగుపెట్టిన తర్వాత కాసేపు ఒత్తిడికి గురయ్యా’’ అని మ్యాచ్‌ అనంతరం రాహుల్‌ వ్యాఖ్యానించాడు. ‘‘నన్ను నేను శాంత పరుచుకోవడానికి, నిలదొక్కుకోవడానికి 10-15 బంతులు అవసరమయ్యాయి. ఒకట్రెండు బౌండరీలు కొట్టాక గాడినపడ్డా. గతంలో ఆడినట్లే ఆడా’’ అని అన్నాడు. ఎన్‌సీఏలో పునరాగమనంలో ఉన్న రాహుల్‌.. ఆసియాకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడని సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని